వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. గన్నవరం టీడీపీ కార్యాలయ ఉద్యోగి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఇప్పటికే రిమాండ్‌లో ఉన్న వంశీకి, ఈ రోజు ముగియాల్సిన రిమాండ్‌ను ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు మరోసారి పొడిగించింది. తద్వారా ఆయనను ఈ నెల 22వ తేదీ వరకు జైలులోనే ఉంచాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో పోలీసులు వంశీని విజయవాడ జిల్లా జైలుకు మళ్లీ తరలించారు.
కిడ్నాప్ కేసులో వంశీతో పాటు వెలినేని శివరామకృష్ణ ప్రసాద్, గంటా వీర్రాజు, నిమ్మ చలపతి, వేల్పూరు వంశీబాబు లాంటి వారిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వీరంతా ప్రస్తుతం జిల్లా జైలులో ఉన్నారు. కేసు విషయంలో విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. తమపై ఉన్న ఆరోపణలను కొట్టేసేందుకు నిందితులు ప్రయత్నించినప్పటికీ, కోర్టు రికార్డులు, పోలీసుల ఆధారాలతో ముందుకు సాగుతోంది.
ఈ కేసులో మరికొంతమంది కీలక నిందితులు ప్రస్తుతం నేపాల్‌లో తలదాచుకున్నట్టు సమాచారం. ముఖ్యంగా వంశీకి అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన కొమ్మా కోటేశ్వరరావు అలియాస్ కోట్లు అక్కడే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతడితో పాటు మరో ముగ్గురు వ్యక్తులు కూడా నేపాల్‌లో ఉంటూ, రాత్రి సమయాల్లో స్నేహితులు, అనుచరులతో టచ్‌లో ఉండే ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.
వీరు పోలీసులు అడుగు ఎటు వేస్తున్నారో తెలుసుకునేలా వ్యవహరిస్తుండటంతో, ఇక వారి పట్టుబడటం కూడా సమీపంలోనే ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నేపాల్‌లో వీరు ఎక్కడ తలదాచుకున్నారో తెలుసుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఈ కేసు మలుపులు మరింత ఉత్కంఠను రేపుతున్నాయి. వంశీకి త్వరలో బెయిల్ లభిస్తుందా? లేక కేసు మరింత బలపడుతుందా అనే విషయంపై పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది.