Paritala Sunitha: రామగిరి మండలం పాపిరెడ్డి పల్లి గ్రామంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించిన విషయం తెలిసిందే. ఇటీవల హత్యకు గురైన లింగమయ్య కుటుంబ సభ్యులను ఈయన ఓదార్చారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా జగన్ పర్యటనపై రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డి పాపిరెడ్డి పల్లికి శవ రాజకీయాలు చేయడానికి వచ్చారే తప్ప పరామర్శలకు కాదు అంటూ విమర్శలు కురిపించారు.
జగన్ గ్రామాల్లో చిచ్చు పెట్టే విధంగా మాట్లాడుతున్నారని సునీత ఆరోపించారు. అనంతపురంలో పులివెందుల తరహా హత్యలు జరగవంటూ పరిటాల సునీత ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే తాము అనుకుని ఉంటే జగన్ ఈ గడ్డపై అడుగు పెట్టే వారే కాదని తాము ఎవరికి భయపడేది లేదంటూ సునీత వెల్లడించారు.
వైఎస్ జగన్‌ది పరామర్శ కాదని, ప్రచారం కోసం చేసిన రాజకీయ విన్యాసమని పరిటాల సునీత ఆరోపించారు. జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారని, ఆయన మాటల్లో నిజం లేదని తెలిపారు.పరామర్శకు వచ్చారా లేక అభిమానులతో జేజేలు పలికించుకుంటూ, జగన్ సీఎం అని అనిపించుకోవడానికి వచ్చారా అని ప్రశ్నించారు. సెల్ఫీలు తీసుకుంటూ పరామర్శలు చేయడం ఏమిటని ఎద్దేవా చేశారు.
జగన్మోహన్ రెడ్డి అబద్దాలను పేపర్ పై రాసుకోవచ్చు మరి ఇక్కడ చదివి వినిపించారు. లింగమయ్య హత్యను ఫ్యాక్షన్ హత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తనను , తన కుమారుడిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని.. తాము కావాలంటే ఎంపీపీ స్థానాన్ని దక్కించుకునే వారమని అన్నారు. నేను తలుచుకొని ఉంటే ఆ ఎంపీపీ స్థానాన్ని జగన్ కాదు కదా వాళ్ళ నాయన వచ్చినా కూడా ఆపలేకపోయేవారు అంటూ జగన్ , మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తీరుపై మండిపడ్డారు.