AP: ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కారణంగా తాము జేఈఈ పరీక్షలకు హాజరు కాలేకపోయాము అంటూ 30 మంది విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి అయితే ఈ వీడియోలపై జన సైనికులు అలాగే పోలీసులు కూడా స్పందించారు. ఈ సందర్భంగా జనసేన నేతలు మాట్లాడుతూ ఉదేశపూర్వకంగానే ఇలాంటి తప్పుడు వీడియోలను ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు.
మరోవైపు పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కారణంగా విద్యార్థుల పరీక్షకు ఆలస్యం కాలేదు అంటూ పోలీసులు కూడా తెలిపారు. ఈ క్రమంలోనే పోలీసులు అసలు నిజానిజాలను బయటపెట్టారు.. జేఈఈ పరీక్షలు ఉదయం 9 గంటలకు జరుగుతాయి. 8:30 నిమిషాలకు లోపు అభ్యర్థుల పరీక్ష కేంద్రం వద్ద ఉండాలి. ఇలా సమయానికి పరీక్ష కేంద్రం వద్ద ఉండాలి అంటే పరీక్ష రాసే విద్యార్థులు ఏడు గంటలకు పరీక్ష కేంద్రం వద్దకు వెళ్లాల్సి ఉంటుంది.
అయితే పవన్ కళ్యాణ్ కాన్వాయ్ పెందుర్తి సర్కిల్ వద్ద 8:45 వెళ్లేలా షెడ్యూల్ ఉంది. పవన్ కాన్వాయ్ వెళ్లే సమయానికి పరీక్షలు రాసే విద్యార్థులు పరీక్ష కేంద్రం లోపల ఉంటారు. సోమవారం విశాఖలో పవన్ కాన్వాయ్ ఆ దారి మీదుగా ఉదయం 8.41 గంటలకు వెళ్లింది. అంటే.. పరీక్షా కేంద్రానికి విద్యార్థులు చేరాల్సిన గడువు ముగిసిన తర్వాతే ఆ ప్రాంతం మీదుగా పవన్ కాన్వాయ్ వెళ్లింది. అంటే.. పవన్ కాన్వాయ్ కారణంగా విద్యార్థులు పరీక్షా కేంద్రానికి వెళ్లలేకపోయారన్న మాటలో వాస్తవం లేదని పోలీసులు స్పష్టంగా తెలియజేశారు.
ఈ లెక్కన సోమవారం నాటి పరీక్షకు 30 మంది విద్యార్థుల గైర్హాజరుకు పవన్ పర్యటనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాలి. ఇక ఈ పరీక్షా కేంద్రం ఉన్న గోపాలపట్నం, పెందుర్తి జంక్షన్లలో ఉదయం 8.30 గంటల వరకు ఎలాంటి ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయలేదని పోలీసులు ఈ విషయంపై నిజా నిజాలు బయట పెట్టారు.