Health Tips: ఈ చిట్కాల వల్ల నోటి పూత సమస్య నుండి ఉపశమనం పొందవచ్చని తెలుసా?

Health Tips:నోటిలో పుండ్లు సాధారణంగా అందరిలోనూ ఏర్పడతాయి, దీనిని నోటి అల్సర్ అని కూడా అంటారు. అయితే ఇవి కొందరిలో వాటంతటవే త్వరగా తగ్గిపోతాయి. కొందరిలో చాలా రోజుల వరకు ఉండటమే కాకుండా ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాయి. ఇవి సాధారణంగా నోటి శుభ్రతను పాటించకపోవడం, హార్మోన్లలో మార్పులు, ఎసిడిటి, విటమిన్ బీ, సీ, ఐరన్, ఇంకా ఇతర పోషకాల లోపం వల్ల ఏర్పడుతుంటాయి. ఇవి ఎక్కువగా పెదవుల కింద, చిగుళ్ళలో, నాలుక మీద, దౌడల మీద ఎక్కువగా పడుతుంటాయి. నిజానికి వీటి వల్ల మనిషికి ఎటువంటి అపాయము లేదు. కానీ ఏదైనా తినాలి అన్న, ఏదైనా తాగాలి అన్న, బ్రష్ చేయాలి అన్న కూడా చాలా నొప్పిని కలిగిస్తాయి. శరీరంలో ఉండే వేడి వల్ల కూడా పుండ్లు పుడతాయి. నోటి అల్సర్ నీ తగ్గించుకోవడానికి ఎక్కువగా మెడికల్ షాప్ లలో దొరికే గ్లిజరిన్ ఉపయోగిస్తుంటారు. వీటిని సులువుగా ఇంట్లో దొరికే పదార్థాల ద్వారా తగ్గించుకోవచ్చు.

• తేనెలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. తేనెలో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. కొద్దిగా తేనెను నోటిలో పుండ్లు అయిన ప్రదేశంలో రాయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. చిటికెడు పసుపు తేనెను కలిపి పుండ్లు అయిన ప్రదేశంలో పూయడం వల్ల కూడా ఫలితం లభిస్తుంది. ఉసిరి పొడిలో కాస్త తేనె ను కలిపి పుండు అయిన ప్రదేశాలలో రాయడం వల్ల త్వరగా నయం అవుతుంది.

• నోటిలో పుండ్ల వల్ల కలిగే వాపును తగ్గించడానికి 8 గ్రాముల పటిక బెల్లం, ఒక గ్రాము కర్పూరం తీసుకొని దానిని పుండ్ల మీద రాస్తే మంచి ఫలితం ఉంటుంది. పటిక బెల్లాన్ని మౌత్ ఫ్రెష్నర్ గా ఉపయోగిస్తారు. నోటి పుండ్లు, వాపుని తగ్గించడానికి కర్పూరం కూడా బాగా ఉపయోగపడుతుంది.

• నోటిలో పుండ్లు ఏర్పడితే కొబ్బరి నూనె లేదా నెయ్యి తీసుకొని మెల్లగ మర్దన చేయాలి. ఇలా చేస్తున్నప్పుడు నోటిలో నీరు ఊరడం జరుగుతుంది, దానిని ఉమ్మివేసి తిరిగి అలాగే మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది.

• అలోవెరా జ్యూస్ తాగడం వల్ల నోటిలో, కడుపులోని అల్సర్ తగ్గుతుంది. రోజుకి రెండు సార్లు ఈ జ్యూస్ తాగడం వల్ల నోటిలోని పండ్లు త్వరగా నయం అవుతాయి.