ఇంట్లో ప్రశాంతత, ఆనందం, ఆర్థిక స్థిరత్వం కావాలని ఎవరు కోరుకోరు..? రోజువారీ జీవితంలో ఎంత కష్టపడినా, ఇంటి వాతావరణం సానుకూలంగా లేకపోతే మనసుకు తృప్తి ఉండదు. అందుకే భారతీయ సంప్రదాయాల్లో వాస్తు శాస్త్రానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇంటి లోపల సరైన దిశలో సరైన వస్తువులు ఉంచడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మరి సంపద పెరగాలంటే, ఇంట్లో శ్రేయస్సు నిలవాలంటే ఎలాంటి వాస్తు పద్ధతులు పాటించాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో పవిత్రతకు, ఐశ్వర్యానికి ప్రతీకగా భావించే తులసి మొక్కకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే ఇంటి ఈశాన్య దిశలో తులసి మొక్కను నాటితే ఆరోగ్యంతో పాటు ఆర్థిక అభివృద్ధి కూడా కలుగుతుందని చెబుతారు. ప్రతిరోజూ తులసికి దీపం వెలిగించి పూజ చేయడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుందనే నమ్మకం ఉంది.
అలాగే కలశం కూడా వాస్తులో కీలకమైన వస్తువుగా చెబుతారు. స్వచ్ఛతకు, సంపూర్ణతకు చిహ్నంగా భావించే కలశాన్ని ఇంటి ఉత్తర లేదా ఈశాన్య దిశలో ఉంచితే ప్రతికూల శక్తులు తొలగిపోతాయని అంటారు. కలశం వల్ల ఇంట్లో ఆనందం, శాంతి, సంపద వృద్ధి చెందుతుందని వాస్తు పండితుల అభిప్రాయం.
శంఖం కూడా లక్ష్మీదేవికి సంబంధించిన పవిత్ర చిహ్నం. పూజా సమయంలో శంఖాన్ని ఊదటం మనకు తెలిసిందే. అయితే శంఖాన్ని లక్ష్మీదేవి విగ్రహానికి కుడివైపున ఉంచడం శుభప్రదమని చెబుతారు. దీనివల్ల ఇంట్లో అదృష్టం నిలిచిపోతుందట. అలాగే ప్రధాన ద్వారం వద్ద స్వస్తిక్, శుభం వంటి శుభ చిహ్నాలు గీయడం వల్ల ఇంట్లోకి మంచి శక్తి ప్రవేశిస్తుందని విశ్వాసం.
ఇక లోహాల విషయానికి వస్తే, ఇత్తడి, రాగి వంటి లోహాలను వాస్తు శాస్త్రం చాలా శక్తివంతమైనవిగా పేర్కొంటుంది. పూజ గదిలో ఈశాన్య లేదా ఉత్తర దిశలో ఈ లోహాలతో చేసిన వస్తువులు ఉంచడం మంచిదని సూచిస్తారు. ముఖ్యంగా ఇత్తడి గంటను ఉత్తర దిశలో ఉంచి నిత్యం వినియోగిస్తే ఇంటి వాతావరణం పవిత్రంగా మారుతుందని చెబుతారు. చిన్నచిన్న వాస్తు నియమాలే అయినా, అవి మన ఇంటి శక్తిని మార్చగలవని వాస్తు శాస్త్రం నమ్మకం. సంపదతో పాటు మనశ్శాంతి కూడా కావాలంటే, ఈ సంప్రదాయాలను ఒకసారి పాటించి చూడాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. (గమనిక: ఈ కథనం నిపుణులు అందించిన సాధారణ సమాచారం ఆధారంగా రాసినది. దీనిని తెలుగు రాజ్యం ధృవీకరించడం లేదు.)
