Health Tips: గంటలకొద్దీ కూర్చొని పని చేస్తున్నారా.. మీకు ఈ 5 భయంకరమైన ముప్పులు తప్పవు..!

ఈ డిజిటల్ యుగంలో ఎక్కువ మంది తమ రోజంతా కంప్యూటర్ ముందు గడుపుతున్నారు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఎనిమిది గంటలు పైగా కుర్చీలో కూర్చునే పరిస్థితి ప్రస్తుతం ఉంది. అయితే ఈ అలవాటు ఎంత ప్రమాదకరమో మనలో చాలామందికి తెలీదు. ఒకవేళ ఇది కొనసాగితే, వయస్సు పెరగక ముందే ఆరోగ్య సమస్యలే కాదు.. వృద్ధాప్య లక్షణాలు కూడా కనపడే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు.

ఇక పొట్టమీద కొవ్వు పేరుకుపోవడం, వెన్నెముక సమస్యలు మొదలవుతాయి. మెడనొప్పి, తలనొప్పి, స్పోండిలైటిస్ లాంటి సమస్యలు ఒక్కసారిగా రావు కానీ రోజు రోజుకీ శరీరాన్ని లోపలి నుంచి నశింపజేస్తుంటాయి. ముఖ్యంగా, శారీరక కదలిక లేకపోవడం వల్ల రక్తప్రసరణ బాగా జరగదు. దాంతో గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్, బీపీ వంటి సమస్యలు ముందుచూపుతాయి. నిజానికి చాలా సైలెంట్‌గా పాకే డేంజర్ ఇది. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల బాడీ ఇన్సులిన్ సెన్సిటివిటీ కోల్పోతుంది. ఫలితంగా డయాబెటిస్‌కు దారి తీస్తుంది. పైగా క్యాలరీల్ని ఖర్చు చేయకపోవడం వల్ల బరువు క్రమంగా పెరుగుతూ.. స్థూలకాయం దాకా తీసుకెళ్తుంది.

ఇదే కాకుండా, మనస్సుపై కూడా దీని ప్రభావం పడుతుంది. వర్క్ ప్రెజర్, కదలికలేకపోవడం కలిసొచ్చి ఒత్తిడిని పెంచుతాయి. చిరాకు, మూడ్ స్వింగ్స్, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు ఏర్పడతాయి. అంతేకాదు, స్క్రీన్ ముందు ఎక్కువసేపు ఉండడం వల్ల కంటికి సంబంధించిన సమస్యలు కూడా తలెత్తుతాయి. కంటి మంట, తల తిరుగు, చూపులో అస్పష్టత.. ఇవన్నీ కామన్‌గా ఎదురయ్యే లక్షణ్యాలు.

కాబట్టి ముందే జాగ్రత్త పడితే మంచిదని నిపుణులు చెబుతున్నారు. గంటకు ఒకసారి లేచి నడవడం, సరిగ్గా కూర్చునే విధానాన్ని పాటించడం, రోజు కనీసం 30 నిమిషాలు శరీరాన్ని కదిలించడం అనేవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలానే, స్క్రీన్ నుంచి కళ్ళను కొంతసేపు తిప్పుతూ కంటికి విశ్రాంతి ఇవ్వాలి. సరైన ఆహారం తీసుకోవడం, నీటిని తగినంతగా తాగడం కూడా చాలా అవసరం.

నిశ్చలంగా కూర్చున్న జీవితం చివరికి శారీరక మానసికంగా ఇబ్బంది పడే ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి, తక్కువ కదలికలతో పనిచేసే వారు, ఈ రోజే జీవనశైలిలో చిన్న మార్పులు చేసుకుని ఆరోగ్యంగా ఉండేందుకు ముందు అడుగు వేయాలి. ఎందుకంటే జీవితం మీకు దేవుడు ఇచ్చిన గిఫ్ట్.. దానిని రోగాలతో నింపుకోకండి.