Health Tips: మధ్యాహ్నం చిన్న నిద్ర.. శరీరానికి వరమా.. హానికరమ.. తప్పక తెలుసుకోవాల్సిన విషయం ఇదే..!

రోజంతా శరీరం అలసిపోయినప్పుడు ఒక చిన్న నిద్రే మనకు కొత్త ఉత్సాహం ఇస్తుందని.. నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం భోజనం తరువాత కొద్దిసేపు తీసుకునే పవర్ నాప్ శరీరానికి సహజ రీఛార్జ్ బటన్‌లా పనిచేస్తుందని తాజా పరిశోధనలు నిర్ధారించాయి.

నేషనల్ స్లీప్ ఫౌండేషన్, హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధనల ప్రకారం, మధ్యాహ్నం 20-30 నిమిషాల నిద్రపోవడం మనసుకు, శరీరానికి అనేక లాభాలు అందిస్తుంది. ఇది మెదడును చురుగ్గా ఉంచుతుంది, దృష్టి శక్తిని పెంచుతుంది, అలాగే హృదయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చిన్న నిద్ర ఒత్తిడిని తగ్గించి, మానసిక ఉల్లాసాన్ని పెంచుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అయితే, ఎక్కువసేపు మధ్యాహ్నం నిద్రపోవడం మాత్రం శరీరానికి హానికరం. గంటకు మించిన నిద్ర రాత్రి నిద్రపైన ప్రతికూల ప్రభావం చూపుతుందని, దీని వలన ఊబకాయం, గుండె సంబంధిత సమస్యలు, మధుమేహం వంటి వ్యాధుల ప్రమాదం పెరిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

మధ్యాహ్నం నిద్రకు సరైన సమయం కూడా కీలకం. నిపుణులు సూచనల ప్రకారం, మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల మధ్య నిద్రపోవడం ఉత్తమం. ఈ సమయం మన శరీరంలోని సహజ నిద్ర చక్రంతో సరిపోతుంది, రాత్రి నిద్రకు కూడా ఎలాంటి ఆటంకం కలగదు. నిద్ర కోసం నిశ్శబ్దం, సౌకర్యవంతమైన ప్రదేశాన్ని ఎంచుకోవడం వల్ల గాఢంగా నిద్రించడం సులభమవుతుంది.

అలాగే, మధ్యాహ్నం నిద్రలేచిన వెంటనే భారమైన ఆహారం తీసుకోవడం, ఎక్కువ కాఫీ, టీ లేదా పొగాకు దూరంగా ఉండటం మానుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఇవి శరీరాన్ని మరింత అలసటకు గురి చేస్తాయి. బదులుగా తేలికపాటి ఆహారం, శరీరానికి తగినంత నీరు తీసుకోవడం ద్వారా నిద్ర ప్రభావం మరింత చక్కగా ఉంటుంది. మధుమేహం, రక్తపోటు లేదా నిద్ర సమస్యలు ఉన్నవారు మధ్యాహ్నం నిద్రకు ముందు వైద్యుడిని సంప్రదించడం అవసరం. సరైన పద్ధతిలో చిన్న నిద్రను అలవాటు చేసుకుంటే ఉత్పాదకత పెరుగుతుంది, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.

ఒక విధంగా చూస్తే మధ్యాహ్నం చిన్న నిద్ర మన శరీరానికి సహజ వైద్యంలా మారుతుందని నిపుణులు అంటున్నారు. కాబట్టి బిజీ షెడ్యూల్ మధ్యలోనూ రోజూ 20 నిమిషాల సమయాన్ని కేటాయించడం ద్వారా ఆరోగ్యం, ఉత్సాహం రెండింటినీ మనం సొంతం చేసుకోవచ్చు. (గమనిక: ఈ కథనాన్ని నిపుణులు అందించిన సాధారణ సమాచారం ఆధారంగా రాసినది.. దీనిని తెలుగు రాజ్యం ధృవీకరించడం లేదు.)