వాకింగ్ అనేది ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎవరైనా సులభంగా చేయగల సులువైన వ్యాయామం. కానీ ప్రస్తుతం చాలామందికి ఒకే డౌట్.. ఉదయం నడవడం మంచిదా..? లేక సాయంత్రం నడక ఆరోగ్యానికి లాభమా..? దీని గురించి డాక్టర్లు, ఫిట్‌నెస్ నిపుణులు చెప్పేది ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఉదయపు నడకను ఎందుకు ప్రాధాన్యం ఇస్తారు అంటే, ఆ సమయానికి గాలి శుద్ధంగా ఉంటుంది. పొల్యూషన్ తక్కువ, ఆక్సిజన్ ఎక్కువ. ఖాళీ కడుపుతో నడవడం వల్ల శరీరంలోని నిల్వ కొవ్వు వేగంగా కరిగిపోతుంది. ఆపై సూర్యుని కిరణాలు మన మానసిక ఆరోగ్యాన్ని చురుకుగా ఉంచుతాయి. సిరోటోనిన్ ఉత్పత్తి పెరిగి మనసు ఉల్లాసంగా ఉంటుంది. దీంతో రోజంతా ఫ్రెష్‌గా ఉండే ఎఫెక్ట్ వస్తుంది. రాత్రి కూడా నిద్ర బాగా పడుతుంది.
అయితే చలికాలంలో ఉదయాన్నే లేచే వాళ్లకీ, శ్వాసకోశ సమస్యలున్న వాళ్లకీ ఉదయపు చల్లని గాలిలో నడక కాస్త ఇబ్బందే. ఇక వర్షాకాలంలో చినుకులు పడినా ఉదయం నడక కుదరని పని.. అందుకే కొందరికి సాయంత్రం నడకే బెటర్ అని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా డిన్నర్ తరువాత కొద్దిసేపు నడక వేస్తే జీర్ణక్రియ బాగుంటుంది. ఊబకాయం దూరమవుతుంది. రోజంతా పనిచేసి ఇబ్బంది ఉన్నవారికి సాయంత్రం నడక మంచి రిలీఫ్ ఇస్తుంది. కుటుంబం లేదా ఫ్రెండ్స్‌తో కలిసి నడవొచ్చు కాబట్టి ఇది మానసికంగా కూడా రిలాక్స్ అయ్యే అవకాశం ఇస్తుంది.
అందువల్ల, ఉదయం టైమ్ కుదరకపోతే సాయంత్రం నడకను మానకండి. ఏ సమయం అయినా సరే, రోజూ కనీసం అరగంట నడక ఆరోగ్యమే కాదు, ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. అందుకే నిపుణుల సలహా ఏంటంటే.. ఎప్పుడు కావాలన్నా నడవండి, ఆరోగ్యంగా ఉండండి.