తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్ర మరింత తీవ్రతరం అవుతోంది. ఉదయం, రాత్రి వేళల్లో గుబులు పెట్టించేంత చలికాటుతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయితో పోలిస్తే 6–7 డిగ్రీలు తగ్గిపోవడంతో వాతావరణంలో హఠాత్తుగా వచ్చిన మార్పు స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా ఉదయం పూట సూర్యుడు కనిపించే వరకూ వీధులు, రోడ్లు తెల్లని పొగమంచుతో కప్పుకుని, ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
అయితే ఈసారి చలి బీభత్సం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతాలు. పాడేరు, అరకు, మినుములూరు, చింతపల్లి వంటి లోయ ప్రాంతాలు రికార్డు స్థాయి చలిని నమోదు చేస్తున్నాయి. మినుములూరులో కనిష్టం 4 డిగ్రీలు, అరకులో 4.6 డిగ్రీలు, పాడేరు 6 డిగ్రీలు, చింతపల్లి 6.5 డిగ్రీల వరకు పడిపోవడం అక్కడి ప్రజలను సతమతం చేస్తోంది. ఉదయం పూట ఇళ్లను వదిలి బయటకు రావడమే పెద్ద విషయమైపోతుండగా, పొగమంచు దట్టంగా కమ్ముకోవడంతో నిత్య పనులు చేయడమే సవాలుగా మారింది.
గ్రామీణ ప్రాంతాలకే కాకుండా పట్టణాల్లో కూడా చలి ఎక్కువగా ఉంది. తెల్లవారుజామున ఉద్యోగాలు, వ్యవసాయ పనుల కోసం బయలుదేరేవారు తల నుంచి కాళ్ల వరకూ కప్పుకొని వెళ్లక తప్పని పరిస్థితి. సాయంత్రం ఐదు గంటల తర్వాతే కఠిన చలికాటు మొదలవడంతో సాధారణ పనుల కోసం బయటకు రావడానికే ప్రజలు వెనుకంజ వేస్తున్నారు. హైవేలపై అదనంగా ఏర్పడుతున్న పొగమంచు డ్రైవర్లకు తలనొప్పిగా మారి, వేగం తగ్గించి నెమ్మదిగా ప్రయాణాలు కొనసాగించాల్సి వస్తోంది.
హిమాలయ ప్రాంతాల నుండి వచ్చే ఉత్తర గాలుల దాటే ఈ తీవ్ర చలికి ప్రధాన కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మంచు ప్రభావం తక్కువ ఒత్తిడి గాలులు దిగువ ప్రాంతాలవైపు కదలడం వల్ల ఇంకాస్త చల్లటి గాలి తెలుగు రాష్ట్రాల్లోకి చేరుతోంది. అంతేకాకుండా ఆకాశం నిర్మళంగా ఉండటంతో భూమి నుంచి ఉష్ణం వేగంగా వెలుపలకి వెళ్లిపోవడం రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడానికి కారణమవుతోంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ప్రజలు తప్పనిసరిగా రక్షణ చర్యలు తీసుకోవాలని సూచిస్తోంది. రాత్రివేళ బయటకు వెళ్లేటప్పుడు గాలి చొరబడని దుస్తులు ధరించడం, వృద్ధులు, చిన్నారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరం. రైతులు కూడా పంటలపై చలి ప్రభావం పడకుండా ముందస్తు చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలంటోంది.
