Egg: చలిలో రోజూ ఎన్ని గుడ్లు తినాలి.. వయస్సుకు సరిపోయే ఎగ్ డోస్ ఇదే..!

చలికాలం ముదురుతున్న కొద్దీ ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా సూర్యరశ్మి శరీరానికి తక్కువగా తగలడం వల్ల విటమిన్–డి లోపం ఎక్కువమంది వద్ద కనిపిస్తోంది. అలసట, కీళ్ల నొప్పులు, కండరాల బలహీనత, మానసిక ఒత్తిడి వంటి లక్షణాలకు ఇదే ప్రధాన కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ లోపాన్ని భర్తీ చేయడానికి మన ఇంట్లోనే ఉన్న అద్భుత ఆహారం.. కోడిగుడ్డు ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది.

చలికాలంలో గుడ్డు తినడం శరీరానికి కావాల్సిన వేడి మాత్రమే కాదు, విటమిన్–డి, ప్రొటీన్, ఒమేగా–3, జింక్, ఐరన్‌ వంటి కీలక పోషకాలు కూడా అందిస్తుంది. వాస్తవానికి ఒక ఉడికించిన గుడ్డు శరీరానికి రోజువారీగా అవసరమయ్యే విటమిన్–డి లోపాన్ని గణనీయంగా తగ్గిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. యుఎస్‌ అగ్రికల్చర్ డేటా ప్రకారం 100 గ్రాముల గుడ్లలో 87 మైక్రోగ్రాముల విటమిన్–డి, 12.6 గ్రాముల ప్రోటీన్, విటమిన్–ఎ, బి శ్రేణి విటమిన్లు, సెలీనియం, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

చలికాలంలో విటమిన్–డి తగ్గిపోవడంతో బలహీనత, జుట్టు రాలడం, అలసట వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తాయి. గుడ్డు నియమితంగా తీసుకోవడం ద్వారా ఇవన్నీ తగ్గడమే కాకుండా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. శరీరంలోని ఎముకల నిర్మాణానికి విటమిన్–డి ఎంత ముఖ్యమో మనందరికీ తెలిసిందే. అందుకే ప్రత్యేకంగా ఈ సీజన్‌లో గుడ్డు అత్యవసరం.

నేషనల్ లైబ్రరీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన గణాంకాల ప్రకారం 14–18 ఏళ్ల వయస్సు వరకు రోజుకి 15 మైక్రోగ్రాముల విటమిన్ డి అవసరం. ఈ వయస్సు పైబడినవారికి ఒక్క గుడ్డు రోజూ తీసుకుంటే సరిపోతుందని పేర్కొంటుంది. మితిమీరిన గుడ్లు తినడం ఇతర సమస్యలకు దారితీసే అవకాశం ఉన్నందున, వయస్సుకు తగ్గ పోషకాహారాన్ని పాటించడం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు.

శాకాహారులకు విటమిన్–డి అవసరం కోసం పాలు, పెరుగు, జున్ను వంటి పాల ఉత్పత్తులు మంచి ప్రత్యామ్నాయం. అయినా గుడ్డు అందించే ప్రోటీన్–డి కాంబినేషన్‌ను మరే ఆహారం అంత సులభంగా అందించలేదని పరిశోధనలు నిర్ధారించాయి. మొత్తానికి చలి సమయంలో రోజూ ఒక గుడ్డు మీ ఆహారంలో చేరితే.. విటమిన్–డి లోపం భర్తీ అవుతుంది, శరీరానికి కావాల్సిన వేడి, బలం, పౌష్టికాహారం అన్నీ లభిస్తాయి.