కలలు మన మనసులో దాగి ఉన్న భావాలు, భయాలు, ఆశలు ఎలా కలిసిపోతాయో అర్థం కాని మర్మమే. నిద్రలేచిన వెంటనే చాలా కలలు మాయమైపోతాయి. కానీ కొన్ని మాత్రం మనసుకు గుచ్చుకుని స్పష్టంగా గుర్తుండిపోతాయి. వాటిలో పాము కల ముఖ్యమైనది. పామును కలలో చూడగానే చాలామంది గబగబా భయపడిపోతారు. ఏదో చెడు జరగబోతుందేమో అన్న ఆందోళన వెంటాడుతుంది. అయితే కలల శాస్త్రం మాత్రం ఈ భయానికే భిన్నమైన అర్థం చెబుతోంది.
పాము కనిపించడం ప్రమాద సంకేతమని కాదు, చాలా సందర్భాల్లో అది శుభప్రదంగా భావించబడుతుందని నిపుణులు అంటున్నారు. జీవితంలో కొత్త దిశలు తెరుచుకోవడం, ఆర్థికంగా బలపడటం, వ్యక్తిత్వంలో శక్తి పెరగడం వంటి అంశాలు పాము కలలో ప్రధానంగా ప్రతిఫలిస్తాయని చెబుతారు. ముఖ్యంగా మీ మంచంపై పాము కనిపిస్తే, మీ వ్యక్తిగత జీవితంలో కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నారని, భావోద్వేగపరమైన బంధం ఏర్పడవచ్చని సంకేతమని భావిస్తారు.
అదే పాము కాటు వేసినట్లు కనిపిస్తే, అది ముందస్తు హెచ్చరిక. త్వరలో మీ జీవితంలో ఒక సమస్య తలెత్తవచ్చనేది సూచన. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందనేదే అర్థం. పాము కాళ్ల మీద ఎక్కుతున్నట్లు కలగంటే, త్వరలోనే ఆర్థిక లాభం దక్కబోతుందనే శుభసూచనగా భావిస్తారు. పాము రంగు కూడా కల అర్థాన్ని పూర్తిగా మార్చేస్తుందని కలల పరిశోధకులు చెబుతున్నారు. తెల్ల పాము కనిపిస్తే కుటుంబానికి శ్రేయస్సు, అదృష్టం చేరువలో ఉందని చెబుతున్నారు. అదే నల్ల పాము కనిపిస్తే అది చెడ్డకల కాదు. అది వ్యక్తిత్వ బలం, కీర్తి, ప్రభావం పెరగబోతున్నదన్న సంకేతంగా పరిగణించాలని చెబుతున్నారు.
కలలో కనిపించే ప్రతి పాము ఒకే అర్థం ఇవ్వదు. అది ఎక్కడ కనిపించింది, ఎలా ప్రవర్తించింది, ఏ రంగులో ఉంది.. ఇవన్నీ కల వెనుక ఉన్న సందేశాన్ని నిర్ణయిస్తాయి. పాముల కలలు కొన్నిసార్లు మన అంతర్గత భయాల ప్రతిబింబం అయినా, ఎక్కువ సందర్భాల్లో ఇవి జీవన మార్పులు, పునరుద్భవం, శక్తివంతమైన దిశల వైపు ప్రయాణానికి సూచికలుగా భావించాలి. (గమనిక: ఈ కథనం పండితులు అందించిన సాధారణ సమాచారం ఆధారంగా రాసినది. దీనిని తెలుగు రాజ్యం ధృవీకరించడం లేదు.)
