టీమిండియాకు ఘోర పరాజయం..రెండో టీ20లో సఫారీల ఘన విజయం..!

సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా ప్రదర్శన ఒక్క మాటలో చెప్పాలంటే నిరాశపరిచింది. 214 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో మన బ్యాటర్లు పూర్తిగా తడబడ్డారు.. తిలక్ వర్మ తప్ప మిగతా అందరూ వరుసగా పెవీలియన్ దారి పట్టారు. మ్యాచ్ మొదటి నుంచే భారత దారుణంగా విఫలమైంది. గిల్ డక్, అభిషేక్ ఫ్లాప్, సూర్య, హార్దిక్, జితేశ్ కూడా పెద్దగా చేయకపోవడంతో భారతకు ఘోర పరాభవం తప్పలేదు.

తిలక్ వర్మ ఒక్కడే 62 పరుగులతో పోరాడినప్పటికీ, ఎక్కడా సహకారం దొరకలేదు. అక్షర్ పటేల్ 21, జితేశ్ 27 పరుగులు చేసినా ఆ ప్రదర్శన భారత ఇన్నింగ్స్‌ను నిలబెట్టలేదు. చివరకు మొత్తం జట్టు 19 ఓవర్లు కూడా పూర్తికాక ముందే 162 పరుగులకే ఆలౌట్ అయింది. భారీ లక్ష్యం ముందు 51 పరుగుల తేడాతో ఓటమి భారత అభిమానులను మరింత నిరాశలోకి నెట్టింది.

ఇక సఫారీ బ్యాట్స్‌మెన్ మాత్రం భారత్ బౌలర్లను ఆడుకున్నారు. ఓపెనర్ క్వింటన్ డికాక్ 90 పరుగులతో భారత బౌలర్లను చిత్తుగా కొట్టాడు. 7 సిక్సులు, 5 ఫోర్లతో చేసిన ఆ దుమ్ముదులిపిన ఇన్నింగ్స్‌ను ఆపడం భారత బౌలర్లకు అసాధ్యమైంది. కెప్టెన్ మార్క్ రమ్ 29, మిల్లర్ 20, డొనొవాన్ 30 వంటి కీలక పరుగులతో స్కోర్ 213కి చేరింది.
భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మాత్రమే 2 వికెట్లు తీసి కొంత మెరుపు చూపించాడు. అక్షర్ ఒక వికెట్ తీసినప్పటికీ, రన్స్ కంట్రోల్ చేయడంలో మాత్రం టీమిండియా విఫలమైంది. మొత్తం మ్యాచ్‌లో బౌలింగ్, బ్యాటింగ్, ఎనర్జీ ఏ విభాగంలోనూ భారత్ స్థాయి ప్రదర్శన కనబరచకపోవడంతో ఓటమి తప్పలేదు.