ప్రపంచంలోకి వచ్చే ప్రతి శిశువు మొదటి పలుకరింపు ఏడుపే. ఒక చిన్న గుండె పెద్ద ప్రపంచాన్ని మొదటిసారి చూడబోయే ఆ క్షణంలో, ఆ ఏడుపు వినిపిస్తేనే తల్లిదండ్రులూ, డాక్టర్లూ ఊపిరి పీలుస్తారు. కానీ పుట్టిన వెంటనే బిడ్డ ఎందుకు ఏడుస్తుంది.. నవ్వుతూ ఎందుకు పుట్టదు.. ఈ ప్రశ్నలకు శాస్త్రం చెప్పే సమాధానం నిజంగా ఆశ్చర్యపరుస్తుంది.
తల్లి గర్భంలోని నిశ్శబ్ద, వేడిమి, నీడల ప్రపంచం నుంచి ఒక్కసారిగా బయటి చల్లని గాలి, ప్రకాశవంతమైన వెలుతురు, కొత్త శబ్దాలు, శరీరానికి తగిలే గురుత్వాకర్షణ.. ఇవన్నీ శిశువుకు ఒక్క క్షణంలో భారీ షాక్‌ని ఇస్తాయి. నిమిషం క్రితమే ద్రవంతో నిండిన సురక్షిత గర్భంలో ఉన్న చిన్నారి, అకస్మాత్తుగా కొత్త వాతావరణాన్ని ఎదుర్కొనడం వల్ల సహజంగానే ఏడుస్తుంది. ఈ ఏడుపే బిడ్డ బయట ప్రపంచానికి సరిపడటానికి చేస్తున్న మొదటి ప్రయత్నం.
పైగా, పుట్టిన వెంటనే వచ్చే ఈ ఏడుపు శిశువు శ్వాస వ్యవస్థను ‘ఆన్’ చేసే స్విచ్‌లాంటిది. గర్భంలో ఉన్నంతసేపూ బాబు ఊపిరితిత్తుల్లో ద్రవం నిండే ఉంటుంది. బయటకు రాగానే మొదటిసారి గాలి బలంగా ప్రవేశించి ఆ గాలి సంచులను తెరుస్తుంది. అదే శిశువుకు కొత్త అనుభవం. ఊపిరితిత్తుల్లోని ద్రవం బయటికి వెళ్లి, ఆక్సిజన్ రక్తంలో ప్రసరించడం ప్రారంభమవుతుంది. ఇదే కారణంగా డాక్టర్లు శిశువు ఏడుపు విన్నప్పుడు అది ఆరోగ్యంగా ఉందని నమ్మకం ఏర్పడుతుంది.
ప్రసవం అనంతరం వైద్యులు చేసే ఆప్గర్ స్కోర్‌లో కూడా ఏడుపుకే ప్రత్యేక ప్రాధాన్యం. ఏడవని బిడ్డల్లో శ్వాస నెమ్మదిగా ప్రారంభం కావొచ్చు కాబట్టి వైద్యులు నెమ్మదిగా వీపు గోకడం, పాదాలను తట్టి ఉత్తేజపరచడం చేస్తారు. శిశువులో జీవం జ్వలించే ఆ మొదటి క్షణాన్ని ప్రపంచం ఎదురు చూస్తుంది.. దానికి సంకేతం ఏడుపే.
అయితే నవ్వు మాత్రం వెంటనే రాదు. ఎందుకంటే నవ్వు అనేది భావోద్వేగాల ప్రక్రియ. దానికి మెదడులో ప్రత్యేక నరాల మార్గాలు, కండరాల నియంత్రణ అవసరం. పుట్టిన వెంటనే కనిపించే చిన్న చిరునవ్వులు నిజమైన నవ్వులు కావు; అవి కేవలం ‘రిఫ్లెక్స్’ మాత్రమే. కొన్ని వారాలు గడిచాకే శిశువు నిజమైన నవ్వు మొదలవుతుంది. అప్పుడు ఆ చిన్నారి ప్రపంచాన్ని అర్థం చేసుకుంటూ, ప్రేమను తెలుసుకుంటూ, భావోద్వేగంగా స్పందించడం మొదలవుతుంది. మొత్తానికి పుట్టినప్పుడే సైలెంట్‌గా ఉండటం కన్నా బిగ్గరగా ఏడవడం శాస్త్రీయంగా, వైద్యపరంగా, జీవనపరంగా కూడా శిశువుకు మొదటి విజయమే. ఆ చిన్న శబ్దంలోనే జీవితం ప్రారంభమవుతుంది.
