పోలీసు నోటీసులు చిత్తు కాగితాలతో సమానటమట.!

ఎక్కడో డ్రగ్స్ పట్టుబడితే, దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ బురద చల్లడం పెను రాజకీయ దుమారానికి కారణమైంది. నేరుగా ముఖ్యమంత్రికే సంబంధాలున్నాయంటూ టీడీపీ నేతలు కొందరు ఆరోపించారు. ఈ ఆరోపణలపై అధికార వైసీపీ కూడా ధీటుగా స్పందించింది.

టీడీపీ నేతలకే డ్రగ్స్‌తో సంబంధాలున్నాయంటూ వైసీపీ చేసిన ఎదురు దాడి కొత్త వివాదానికి తెర లేపింది. అధికార పార్టీ ఆరోపణలు చేయడమేంటీ.? చేతనయితే చర్యలు తీసుకోండి.. అంటూ టీడీపీ సవాల్ విసిరింది. వైసీపీ, టీడీపీ మధ్య డ్రగ్స్ ఆరోపణలు కొత్త మలుపు తిరిగి పోలీస్ శాఖ, టీడీపీ నేతలకు నోటీసులు ఇచ్చేదాకా వెళ్లింది.

టీడీపీతో పాటు టీడీపీ అనుకూల మీడియాకి కూడా ఏపీ పోలీస్ నుంచి నోటీసులు వెళ్లడం అందర్నీ విస్మయానికి గురి చేస్తోంది. తప్పుడు ఆరోపణలు, తప్పుడు కథనాలతో ప్రభుత్వం పైనా, పోలీస్ వ్యవస్థ పైనా బురద జల్లుతున్నారన్నది ఆ నోటిసుల్లో పోలీస్ శాఖ పేర్కొంది.

ఈ నోటీసులపై స్పందించిన టీడీపీ, నోటీసుల్ని చిత్తు కాగితాల్లా అభివర్ణించింది. టీడీపీ నేత పట్టాభి, పోలీస్ శాఖ పంపిన నోటీసుల్ని లైట్ తీసుకున్నారు. చిత్తు కాగితాల్ని పట్టించుకునే ప్రశక్తే లేదన్నారు. గతంలోనూ పోలీసు నోటిసుల్ని చిత్తు కాగితాల్లా టీడీపీ నేతలు అభివర్ణించిన సందర్భాలున్నాయి.

కొన్ని సందర్భాల్లో అలా లైట్ తీసుకున్న టీడీపీ నేతలు, పోలీస్ విచారణకు హాజరు కాక తప్పలేదు. పోలీస్ శాఖ ఇచ్చిన నోటీసులపై సమాధానం చెప్పడమనేది ప్రతి పౌరుడి బాధ్యత. రాజకీయం వేరు, వ్యవస్థల పట్ల గౌరవం వేరు. విచారణకు హాజరై, తమ వాదనను వినిపించే అవకాశం టీడీపీకి ఉంటుంది. అది విస్మరించి చిత్తు కాగితాలంటూ హేళన చేస్తే, అందుకు తగిన మూల్యం చెల్లించుకోవల్సి వస్తుంది.

ఇదిలా ఉంటే, దేశంలోకి అక్రమంగా దిగుమతి అవుతున్న డ్రగ్స్ విషయంలో వివిధ ప్రభుత్వ విభాగాలు అప్రమత్తమయ్యాయి. కనీ వినీ ఎరుగని రీతిలో డ్రగ్స్ ఎలా దిగుమతి అవుతున్నాయన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారిపోయింది.