కర్ణాటక ఎన్నికల ఫలితాలొచ్చేశాయి. కాంగ్రెస్ పార్టీకి క్లియర్ మెజారిటీ ఇస్తూ కర్ణాటక ప్రజలు తీర్పునిచ్చారు. హంగ్ ఆశలు పెట్టుకున్న జేడిఎస్ కు షాకిచ్చారు. ఏదో రకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలని భావించిన బీజేపీకి భంగపాటు కలిగించారు. ఈ సమయంలో కర్ణాటక ప్రజలు దేశ ప్రజలకు, మరి ముఖ్యంగా బీజేపీ నేతలకు ఇచ్చిన సందేశం ఏమిటన్నది ఇప్పుడు చూద్దాం!
కర్ణాటక ఎన్నికల ప్రచారంలో బీజేపీ రికార్డులు సృష్టించింది. యడియురప్పను పూర్తిగా పక్కన పెట్టి.. అంతా మోడీ అనే అన్నట్లుగా బీజేపీ ప్రచారం సాగింది. ఎన్నికల ప్రచారం ముగుస్తున్న దశలో మోడీ చేపట్టిన పాతిక కిలోమీటర్ల ర్యాలీ ఈ ప్రచారపర్వంలో హైలైంట్ గా నిలిచింది. మొత్తంగా మోడీ 26 ర్యాలీలు, సభలు, రోడ్ షోల్లో పాల్గొనగా… అమిత్ షా ఏకంగా 31 ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొన్నారు.
కర్ణాటకలో ఎక్కడ చూసినా… మోడీ.. మోడీ.. అనే మాట తప్ప మరో మాట వినిపించలేదన్నా అతిశయోక్తి కాదు. కారణం… ఆ స్థాయిలో బీజేపీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు చేపట్టింది. ఇంత చేసినా బీజేపీ విషయంలో కర్ణాటక ప్రజలు లైట్ తీసుకున్నారు. ప్రచారం వద్దని పనే ముద్దని గట్టిగా చెప్పారు. 40% వాటా అవినీతికి తాము వ్యతిరేకమని చెప్పకనే చెప్పారు.
తాము అధికారంలోకి వస్తే ముస్లింలకు రిజర్వేషన్స్ ఎత్తేస్తామనే బీజేపీ నేతల మాటలను కర్నాటక ప్రజలు అంగీకరించలేదు. కులమతాలకు అతీతంగా పాలించేవారు కావాలని ఫిక్సయ్యారు. ప్రజల మధ్య మత గోడలు, కుల దడులు కట్టొద్దని కాస్త గట్టిగానే చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మత ఘర్షణలు జరుగుతాయని చేసిన హెచ్చరికలను కన్నడిగులు లెక్కచేయలేదు.
దీంతో… ఇకనైనా బీజేపీ నేతలు మారాలని అంటున్నారు విశ్లేషకులు. జనం రోజు రోజుకీ ఆలోచనా శక్తి పెంచుకుంటున్నారని సూచిస్తున్నారు. ఫలితంగా అవకాశవాద, మతతత్వవాద రాజకీయాలు తగ్గించాలని హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం, జనం నాడి… తెలంగాణ ఎన్నికల్లోనూ, అనంతరం జరిగే ఏపీ ఎన్నికల్లోనూ ప్రతిభింబించబోతున్నాయని చెబుతున్నారు.
మరి ఇప్పటికైనా మోడీ & కో మారతారా?