కర్నాటకలో ఎవరు అధికారంలోకి వస్తారన్నదానిపై ఎగ్జిట్ పోల్ అంచనాలు బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్ అంచనాలూ కాంగ్రెస్ పార్టీ వైపే ఓటర్లు మొగ్గు చూపినట్లు తేల్చాయి.
బీజేపీకి మరీ తీసికట్టు.. అనే స్థాయిలో సీట్లను ఇవ్వలేదు ఎగ్జిట్ పోల్ అంచనాలు. బాగానే ఇచ్చాయ్.! డెబ్భయ్కి పైన.. 90కి లోపల బీజేపీకి సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చెబుతున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ లెక్క 120కి అటూ ఇటూ.!
అయితే, బీజేపీ మాత్రం తామే అధికారంలోకి వస్తామంటోంది. ఫలితాలు వచ్చాక చూస్తారు కదా.? ఫలితాలు ఎలా వున్నాసరే, అధికారంలోకి వచ్చేది మేమే.. అంటూ కొందరు కమలనాథులు అత్యుత్సాహంతో కూడిన ప్రకటనలు చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వస్తే, బీజేపీ ఎలా అధికార పీఠమెక్కుతుంది.? ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చినాగానీ, అంతకన్నా ముందే కాంగ్రెస్ అభ్యర్థుల్ని బీజేపీ కొనేస్తే.. అలా కొనేసిన వాళ్ళు గెలిస్తే.. తద్వారా బీజేపీ అధికార పీఠమెక్కడానికి ఛాన్స్ వుంటుందన్నమాట.
అప్పుడే కర్నాటకలో అభ్యర్థుల్ని కొనేసే ప్రక్రియ మొదలైందంటూ కన్నడ రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సాధారణంగా గెలిచాక, ప్రజా ప్రతినిథుల్ని కొనేయడం చూస్తుంటాం. కానీ, గెలవకముందే.. అభ్యర్థులుగా వున్నవారి మీద కర్చీఫ్ వేస్తున్నారన్నమాట. రాజకీయం చాలా చాలా మారిపోయింది మరి.!