TG: బిఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి మార్క్ వేసిన రేవంత్ సర్కార్.. కూల్చివేత తప్పదా?

TG: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున మార్పులు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక హైదరాబాద్ వంటి మహానగరంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఏర్పడుతూ వాహనదారులకు ఎన్నో ఇక్కట్లు తప్పడం లేదు అందుకే ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా రేవంత్ రెడ్డి సర్కార్ ట్రాఫిక్ నియంత్రణ కోసం ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని ప్రధానంగా ఎంచుకుంది. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఎక్కడ ఫ్లైఓవర్లు నిర్మించాలనే అంశంపై సర్వే ప్రారంభమైంది. సర్వే ప్రకారం, నిర్మాణానికి అవసరమైన ప్రాంతాల్లో మార్కింగ్ మొదలైంది.

ఇలా ఫ్లై ఓవర్ నిర్మాణానికి సంబంధించి భూసేకరణతోపాటు, నివాసాలు, ఆస్తులపై ప్రభావం పడే అవకాశముందని తెలుస్తోంది.భూసేకరణ వల్ల సుమారు 350 ఆస్తులు ప్రభావితమయ్యే అవకాశముందని అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు 90 నివాసాలకు మార్కింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ మార్కింగ్ లో భాగంగా పలువురు రాజకీయ నాయకులు అలాగే సెలబ్రిటీల నివాసాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది.

ఇటీవల నటుడు బాలకృష్ణ ఇంటికి కూడా మార్క్ వేసిన విషయం మనకు తెలిసినదే అయితే తాజాగా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి కూడా మార్కు పడిందని తెలుస్తోంది.బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ అయిన తెలంగాణ భవన్ కూడా ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల సగం కూల్చివేతకు పోయే అవకాశముంది. ఇది రాజకీయంగా సున్నితమైన అంశంగా మారింది. ఫ్లైఓవర్ల నిర్మాణం పేరుతో ఇళ్ల కూల్చివేతల అంశం రాజకీయంగా దుమారం రేగే అవకాశాలు లేకపోలేదు.

ఈ ఫ్లై ఓవర్ నిర్మాణంలో భాగంగా కూల్చివేతలను ప్రారంభిస్తే మరోసారి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది అనడంలో సందేహం లేదు. ఇక ఈ సేకరణలో భాగంగా అరడజను మంది బీఆర్ఎస్ నేతల ఇళ్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అధికారులు మాగ్జిమమ్ ఇళ్లు కూల్చిపోవడం కాకుండా పార్కింగ్ ప్రాంతాలను తీసుకునే అవకాశాలను పరిశీలిస్తున్నారు.