రామ్‌చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ ఎంతవరకు వచ్చింది…?

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ కథానాయకుడిగా కోలీవుడ్‌ దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తర్వాత రామ్‌చరణ్‌ నటిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలేర్పడ్డాయి. ఇక ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో శరవేగంగా జరుపుకుంటుంది.

తాజాగా ఈ సినిమా షూటింగ్‌ సంబంధించి రామ్‌చరణ్‌, నవీన్‌చంద్రపై ఓ యాక్షన్‌ బ్లాక్‌ని చిత్రీకరిస్తునట్లు సమాచారం. ఇక ఈ షెడ్యూల్‌ మార్చి 2 వరకు జరగనుంది. ఓ సాధారణ యువకుడు అసాధారణ నాయకుడిగా ఎదిగిన వైనాన్ని ఆవిష్కరిస్తూ చక్కటి సామాజిక సందేశంతో దర్శకుడు శంకర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని చెబుతున్నారు.

ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా రామ్‌చరణ్‌ ద్విపాత్రాభినయంలో కనిపిస్తారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ కైరా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. అరవింద్‌ స్వామి, ఎస్‌జే సూర్య, సురేష్‌ గోపి, ఈషా గుప్తా, అంజలి, శ్రీకాంత్‌, జయరామ్‌, సునీల్‌, హ్యారీ జోష్‌ మరియు నవీన్‌ చంద్ర ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు.