శరవేగంగా ‘పుష్ప-2’ చిత్రీకరణ.. ప్రత్యేక గీతం నటి కోసం అన్వేషణ

ఒకవైపు ప్రచార కార్యక్రమాలతోనూ… మరోవైపు చిత్రీకరణతోనూ బిజీ బిజీగా గడుపుతోంది ‘పుష్ప2’ బృందం. చిత్రీకరణ దాదాపుగా తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం పతాక సన్నివేశాల్ని తెరకెక్కించడంపై చిత్రబృందం దృష్టిపెట్టింది. ఈ వారం నుంచి రెండు వారాలుపైగానే పతాక సన్నివేశాల్ని తెరకెక్కిస్తారని సమాచారం. పోరాట ఘట్టాలతోపాటు, కొన్ని టాకీ సన్నివేశాలు ఇందులో ఉంటాయని తెలుస్తోంది. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా… సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. రష్మిక మందన్న కథానాయిక.

చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఆగస్టు 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. పతాక సన్నివేశాల తర్వాత… ప్రత్యేక గీతం చిత్రీకరణపై చిత్రబృందం దృష్టి పెట్టనుంది. తొలి భాగంలోని ‘ఊ అంటావా…’ అంటూ సాగే ప్రత్యేకగీతం ఎంతో ఆదరణ పొందింది. అందుకు ధీటుగా ‘పుష్ప2’లో ప్రత్యేక గీతం ఉండేలా చిత్రబృందం జాగ్రత్తలు తీసుకొంటోంది. అందుకు సంబంధించిన పనులు కూడా మొదలైనట్టు తెలిసింది. అయితే ఇందులో ఆడిపాడే కథానాయిక ఎవరన్నదే ఆసక్తికరంగా మారింది. బాలీవుడ్‌ తారల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మరి చిత్రబృందం ఎవరిని ఎంపిక చేస్తుందో, ఎవరికి ఆ అవకాశం దక్కుతుందో చూడాల్సిందే మరి!