వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాకుండా, అంతటి స్థాయి వున్న నాయకుడెవరు.? సాధారణంగా ప్రాంతీయ పార్టీల్లో అధినేత స్థాయి ఇంకెవరికీ రాదు. కానీ, ఆ స్థాయిని మ్యాచ్ చేసే నాయకులు ఖచ్చితంగా వుండి తీరాలి.
వైసీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా సామాజిక సాధికార యాత్ర పేరుతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా మూడు ప్రాంతాల్లో ప్రతిరోజూ ఈ యాత్రకు సంబంధించి బహిరంగ సభలు జరుగుతున్నాయి.
వైసీపీ సొంత మీడియాలో ఈ కార్యక్రమాలకు పబ్లిసిటీ దొరుకుతోంది. కానీ, మిగతా మీడియా సంస్థలు, వైసీపీ సామాజిక సాధికార యాత్రల్ని పూర్తిగా లైట్ తీసుకున్నాయి. వైసీపీ దయా దాక్షిణ్యాలతో నడుస్తున్న మీడియా సంస్థలు కూడా ఈ యాత్రల్ని లైట్ తీసుకోవడం ఆశ్చర్యకరం.
పబ్లిసిటీ కోసం ఆయా మీడియా సంస్థలకు పెద్దయెత్తున ‘సొమ్ములు’ ముట్టజెబుతోంది వైసీపీ. కానీ, ఫలితం వుండటంలేదు. వైసీపీ శ్రేణులు కూడా, వైసీపీ సామాజిక సాధికార యాత్ర పట్ల అంతగా ఆసక్తి చూపడంలేదు.
కొనితెచ్చుకున్న పెయిడ్ జనాలు తప్ప, స్వచ్ఛందంగా ఈ యాత్రల్లో జనం కనిపించడంలేదు. ఆ పెయిడ్ జనాలు కూడా, సభ ప్రారంభమైన వెంటనే వెళ్ళిపోతుండడంతో నిర్వాహకులకు ఏం చేయాలో అర్థం కావడంలేదు.
వైసీపీ అనే కాదు, ప్రస్తుతం రాజకీయ పార్టీలు నిర్వహించే కార్యక్రమాల పట్ల జనం ఇలాగే పెదవి విరుస్తున్నారు. మరెందుకు ఈ తరహా యాత్రలకు డబ్బులు తగలేసుకోవడం.? అంటే, అదంతే.!
ఇక్కడ నాయకత్వ లేమి అనేది సుస్పష్టం. మంత్రులు, ప్రజా ప్రతినిథులు పాల్గొంటున్న యాత్రలకు.. అందునా, అధికార పార్టీ యాత్రలకు జనం లేకపోవడమంటే.. జనాన్ని ఆకర్షించగలిగేలా ఈ యాత్రలు లేవనే కదా అర్థం.? తప్పెక్కడ జరుగుతోందో అధినేత వైఎస్ జగన్ సమీక్షించుకోవాలి.