రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో రూపొందిన గేమ్ ఛేంజర్ భారీ అంచనాల మధ్య థియేటర్లలో సందడి చేసింది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో బిజినెస్ చేస్తూ, భారీ ఓపెనింగ్స్ సాధించింది. అయితే ప్రేక్షకుల స్పందన మిక్స్డ్ టాక్‌గా ఉండడంతో రివ్యూలు కూడా మిశ్రమంగా వెలువడ్డాయి. సినిమా కథ, ఎమోషనల్ కంటెంట్ కొన్ని చోట్ల ఫెయిల్ అయ్యాయని కొందరు భావించినప్పటికీ, గేమ్ ఛేంజర్ వసూళ్లు మాత్రం హాట్ టాపిక్‌గా మారాయి.
Game Changer Review: గేమ్ ఛేంజర్ మూవీ రివ్యూ & రేటింగ్
మొదటి రోజు వసూళ్ల విషయానికి వస్తే, బాక్సాఫీస్ ట్రాకర్స్ గణాంకాల ప్రకారం వరల్డ్ వైడ్ గ్రాస్ 85 కోట్లుగా ప్రకటించారు. ముఖ్యంగా సీడెడ్ ఏరియా 7.6 కోట్లు, గుంటూరు 3.7 కోట్లు, తమిళనాడు 2.5 కోట్లు, పశ్చిమ గోదావరి 2.05 కోట్లు వసూలు చేసినట్లు డేటా తెలిపారు. అయితే, మేకర్స్ అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం, గేమ్ ఛేంజర్ మొదటి రోజు 185 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించినట్లు వెల్లడించారు. ఈ రెండు గణాంకాల మధ్య ఉన్న 100 కోట్ల తేడా ట్రేడ్ వర్గాలు, సినీ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది.
ఈ తేడా కారణం ఏమిటనేది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ట్రాకర్స్ కేవలం థియేటర్లలోని కలెక్షన్లను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. కానీ మేకర్స్ బిజినెస్, ఇతర ఆదాయాల లెక్కలతో కూడిన మొత్తాన్ని ప్రకటించే అవకాశం ఉంటుంది. ఇలాంటి కలెక్షన్ గ్యాప్ సాధారణమైపోయినప్పటికీ, గేమ్ ఛేంజర్ విషయంలో 100 కోట్ల భారీ వ్యత్యాసం సినీ వర్గాలను ఆలోచింపజేస్తోంది. తుది విజయాన్ని సినిమా కథ, నటన, మేకింగ్, ప్రేక్షకుల స్పందన నిర్ణయిస్తాయి. గేమ్ ఛేంజర్ వీకెండ్ కలెక్షన్లు ఎలా ఉంటాయన్నదే అసలు ఫలితానికి క్లారిటీ ఇవ్వనుంది.