YS Jagan: ప్రతి ఒక్క పేదవాడికి అన్ని రకాల ఆరోగ్య వైద్య సేవలు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ అనే ఒక గొప్ప పథకాన్ని తీసుకువచ్చారు దివంగత నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. ఖరీదైన వైద్యం అందక ఏ పేదవాడు చనిపోకూడదన్న ఉద్దేశంతోనే ఆరోగ్య శ్రీ పథకాన్ని తీసుకువచ్చి పేదవారికి ఉచితంగా వైద్యం అందించారు. ఇలా ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతోమంది తిరిగి పునర్జన్మను అందుకున్నారని చెప్పాలి.
ఇక వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం అనంతరం తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ వైద్య సేవలు అంటూ ఈ పథకాన్ని కొనసాగించారు ఇక వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో రకాల వైద్య సేవలను కూడా ఈ ఆరోగ్య శ్రీ పథకంలో చేర్చి ప్రతి ఒక్క పేదవాడికి ఖరీదైన వైద్యం ఉచితంగా అందేలాగా చర్యలు చేపట్టారు. ఇక ప్రస్తుతం కూటమి పార్టీలు అధికారంలో ఉన్న నేపథ్యంలో తిరిగి ఆరోగ్యశ్రీ సేవలను పూర్తిస్థాయిలో నిలిపివేసినట్లు ప్రకటించారు.
ఇలా ఆరోగ్యశ్రీ అనేది పేదవారికి ఒక సంజీవని లాంటిది ఇలాంటి ఒక గొప్ప పథకాన్ని తీసేస్తే ఎంతోమంది వైద్యం అందక ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి అంటూ ఇప్పటికే పలువురు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తాజాగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం ఆరోగ్యశ్రీ పథకాన్ని నిలిపివేయడంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ అంటే మీకు ఎందుకు ఇంత కక్ష చంద్రబాబు. పేదల సంజీవనికి ఉరివేసేలా దుర్మార్గపు చర్యకు ఎందుకు దిగుతున్నారని నిలదీశారు.
వైద్యం ఖర్చు రూ.25 లక్షలు అయినా సరే ప్రజలకు ఉచితంగా అందించేలా మా ప్రభుత్వ హయాంలో తీర్చిదిద్దిన ఈ పథకాన్ని ఎందుకు నాశనం చేశారు. కేవలం మీ స్వార్థపూరిత రాజకీయాల కోసం ఎంతో గొప్ప పథకాన్ని రద్దు చేశారు. మరి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి కోటిన్నర కుటుంబాల ఆరోగ్య బాధ్యతను ఎవరు తీసుకుంటారు అంటూ ప్రశ్నించారు మీరు అధికారంలోకి రాగానే పక్క పధకం తోనే ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేయటం నిజం కాదా అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.