రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా సత్తాచాటలని.. జగన్ సర్కార్ ని గద్దె దించాలని.. టీడీపీ – జనసేనలు కంకణం కట్టుకున్న సంగతి తెలిసిందే. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే ఈ రెండు పార్టీల మనుగడ ప్రశ్నార్ధకం అయ్యే ప్రమాదం ఉందనే కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో… వీరి పోరాటం మరింత వ్యూహాత్మకంగా వెళ్తుందని అంటున్నారు. ఈ సమయంలో నిర్వహిస్తున్న సమన్వయ సమావేశాలు కీలకంగా మారాయి.
టీడీపీ – జనసేన పార్టీలు కలిసి పొత్తు పెట్టుకున్నంత మాత్రాన్న 1 + 1 = 2 అయిపొయే పరిస్థితి రాజకీయాల్లో ఉండవనేది పరిశీలకులు చెబుతున్న మాట. అయితే… రెండు పార్టీల మధ్య పొత్తు అంటే కలవాల్సింది అధినేతలు, అండర్ స్టాండింగ్ లు మాత్రమే కాదు.. మిగిలిన నేతలు కలవాలి. మరి ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్ లో కేడర్ కలవాలి.. కలిసి కదలాలి! అయితే ఈ సమయంలో మిగిలిన నాయకులకు ఆదర్శంగా నిలిచింది తెనాలి సమావేశం!
గుంటూరు జిల్లా తెనాలిలో టీడీపీ-జనసేన నాయకుల ఆత్మీయ సమావేశాన్ని తాజాగా నిర్వహించారు. ఈ కార్యక్రంలో టీడీపీ సీనియర్ నేత, తెనాలి మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్.. జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్, జనసేన తెనాలి ఇన్ ఛార్జ్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా… ఉమ్మడి కార్యాచరణపై స్పష్టత ఇచ్చారు. అనంతరం రెండు పార్టీల కార్యకర్తలు బూత్ స్థాయి నుంచి పని మొదలు పెట్టాలని సూచించారు.
అయితే… ఈసారి తెనాలి నుంచి పోటీచేసేది తానే అని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే… మొదట్లో ఈ విషయంలో ఆలపాటి రాజా సైతం తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరించారని కథనాలొచ్చాయి. అయితే… పొత్తు అధికార ప్రకటన అనంతరం ఏమి జరిగినా, ఎలా జరిగినా… ఈ ఇద్దరు సీనియర్లూ ఆలింగనం చేసుకున్నారు. అభ్యర్థి ఎవరైనా విజయమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పొత్తులో భాగంగా ఇది శుభసూచకం!
టీడీపీ – జనసేన లకు సంబంధించినంతరవరకూ ప్రతీ నియోజకవర్గంలోనూ ఇలాంటి పరిస్థితే ఉంటే ఆశించిన ఫలితాలు కచ్చితంగా వస్తాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే మరికొన్ని చోట్ల దర్శనమిస్తున్న కొట్లాటలు చూస్తుంటే మాత్రం పరిస్థితి ఏమీ మారలేదని… పొత్తు అని నేతలిద్దరు ప్రకటించుకున్నా… కేడర్ కలవడం అంత ముఖ్యం కాదని.. సీట్ల సర్ధుబాటుపై ప్రకటన రాకుండా “సమన్వయం” సాధ్యం కాదని అనిపిస్తుంటుంది!
ఉదాహరణకు… బుధవారం అనకాపల్లిలో టీడీపీ – జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో రచ్చ రచ్చ జరిగింది. దీంతో జనసేన పార్టీ… నోటీసులు కూడా ఇచ్చింది. మూడురోజుల్లో వివరణ ఇవ్వాలని తెలిపింది. అలా అనకాలపల్లి, పిఠాపురంలో జరిగినది ఒకెత్తైతే… తాజాగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో జరిగిన సంఘటన మరొకెత్తు!
తాజాగా జగ్గంపేట నియోజకవర్గ పరిధిలో టీడీపీ – జనసేన సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమయంలో సీటు తమదే అని.. పవన్ కల్యాణ్ కూడా తనవైపే ఉన్నాడని మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కామెంట్ చేశారు. దీంతో సమావేశం కాస్తా రసాభాసగా మారిపోయిందని తెలుస్తుంది.
అక్కడితో ఆగని ఆయన… తనను కాదని ఒకవేళ జనసేన ఇన్ చార్జ్ పాఠంశెట్టి సూర్యచంద్రకు అసెంబ్లీ టిక్కెట్ కేటాయిస్తే తాను ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇచ్చే ప్రసక్తే వుండదని, ఏది ఏమైనా తానుమాత్రం బరిలోనే వుంటానని జ్యోతుల నెహ్రూ తేల్చి చెప్పారు. ఈ కామెంట్లతో జనసేన ఇన్ ఛార్జ్ పాఠంశెట్టి సూర్యచంద్ర తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ తనయుడు నవీన్, సూర్యచంద్ర మధ్య తోపులాట జరిగింది. టీడీపీ, జనసేన శ్రేణులు పరస్పరం కొట్టుకున్నారని తెలుస్తుంది.
దీంతో… ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోనూ పరిస్థితి తెనాలిలో ఆలపాటి రాజా – నాదెండ్ల మనోహర్ ల మధ్య ఉన్న అండర్ స్టాండింగ్ లో ఉంటే ఫలితాలు ఎంత అనుకూలంగా ఉంటాయో…. పిఠాపురం, అనకాపల్లి, జగ్గంపేట టైపులో ఉంటే అంత ప్రతికూలంగా ఉంటాయనే విషయం ఇరు పార్టీల నేతలూ దృష్టిలో పెట్టుకోవాలని అంటున్నారు పరిశీలకులు.