కుమ్మక్కు రాజకీయాల్లో భాగంగానే నాగార్జున సాగర్ ప్రాజెక్టు మీద వైఎస్ జగన్ ప్రభుత్వం దాడికి యత్నంచింది.. అనే ప్రచారం ఇప్పటిది కాదు.! సరిగ్గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందర జరిగిన ఆ ఘటన, అప్పట్లో పెను సంచలనం. కానీ, టీ-కప్పులో తుపానులా చాలా వేగంగా ఆ గొడవ చల్లారిపోయింది.
ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా, అదో పెయిడ్ గొడవ.! కాబట్టే, అంత తేలిగ్గా తుస్సుమనిపోయింది. తెలంగాణలో కేసీయార్‌కి రాజకీయంగా మేలు చేయాలన్న ఉద్దేశ్యంతోనే, ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ సర్కారు ఆ గలాటాకి తెరలేపిందన్నదాంట్లో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు.
కేసీయార్ – జగన్ కలిసి ఓ టీమ్‌లా వర్క్ చేశారు 2019 ఎన్నికల్లో, ఆ తర్వాతా.. అయితే, అది తెరవెనుకాల బాగోతం మాత్రమే.! కేసీయార్ జాతీయ రాజకీయాల ఆలోచన నేపథ్యంలో, జగన్‌ని గులాబీ పార్టీ దువ్విన మాట వాస్తవం. కానీ, ఎక్కడో తేడా కొట్టి, కేసీయార్ – జగన్ బంధం అనుకున్న స్థాయిలో బలపడలేదు.
సరే, అది గడిచిపోయిన వ్యవహారం.! ఇరు రాష్ట్రాల మధ్యా నీళ్ళ పంచాయితీ ఇంకా అలాగే వుండిపోయింది. అది కేసీయార్ ఫెయిల్యూర్, జగన్ ఫెయిల్యూర్.. అన్నిటికీ మించి కేంద్రంలో అధికారంలో వున్న మోడీ సర్కార్ ఫెయిల్యూర్ కూడా.!
ఇవన్నీ పక్కన పెడితే, ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ‘జగన్‌కి దమ్ముంటే, ఇప్పుడు నాగార్జున సాగర్ని టచ్ చేసి చూడాలి..’ అంటూ అల్టిమేటం జారీ చేశారు. ఓ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ముమ్మాటికీ బాధ్యతారాహిత్యమే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.
చంద్రబాబు రాజకీయ శిష్యుడే రేవంత్ రెడ్డి. అలాగని, చంద్రబాబుకి రాజకీయంగా రేవంత్ రెడ్డి సహాయ సహకారాలు అందిస్తారా.? అంటే, కాంగ్రెస్ పార్టీతో రాజకీయంగా చంద్రబాబు కలుపుకుపోయేదాన్ని బట్టి వుంటుందది.