తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడిని కుప్పంలో ఓడించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, పదునైన వ్యూహాల్ని రచిస్తోన్న సంగతి తెలిసిందే. ‘వై నాట్ కుప్పం’ అంటూ చాన్నాళ్ళ క్రితమే వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.
కుప్పం నియోజకవర్గానికి ఆ మధ్య వరాల జల్లు కురిపించారు. కుప్పంలో గెలిస్తే, మంత్రి పదవి పక్కా.. అంటూ ఆఫర్ చేశారు కూడా వైఎస్ జగన్.! అయితే, కుప్పంలో వైసీపీ హంగామా మూణ్ణాళ్ళ ముచ్చటే అయిపోయింది. ఇప్పుడక్కడ వైసీపీ హంగామా పెద్దగా కనిపించడంలేదు.
అయినాగానీ, కుప్పంలో చంద్రబాబుని ఓడించి తీరతామని అంటోంది వైసీపీ. ఇక, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గం ఏదన్నది తేలకపోయినా, ఎక్కడి నుంచి పోటీ చేస్తారు.? అన్నదానిపై వైసీపీ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఎక్కడి నుంచి పోటీ చేసినా పవన్ కళ్యాణ్ ఓడిపోతారన్నది వైసీపీ ధీమా.
నారా లోకేష్‌ని వైసీపీ అంత సీరియస్‌గా తీసుకోవడంలేదు. మంగళగిరిలో మళ్ళీ వైసీపీదే గెలుపని వైసీపీ అధినాయకత్వం ధీమాగా వుంది. మంగళగిరి విషయమై నారా లోకేష్‌కీ అనుమానాలున్నాయి. అందుకే ఆయన గన్నవరం నియోజకవర్గం వైపుకు చూస్తున్నారు. అక్కడ వైసీపీలో అంతర్గత కుమ్ములాటలున్నాయి. అదే లోకేష్‌కి అడ్వాంటేజ్ కాబోతోందన్నది టీడీపీ నమ్మకం.
వై నాట్ 175 అంటున్న వైసీపీ, ఆ స్థాయిలో ప్రజల్లో సానుకూలత సంపాదించిందా.? అంటే, అది ప్రస్తుతానికి ఓ మిలియన్ డాలర్ క్వశ్చన్. కానీ, చంద్రబాబు మాత్రం గత ఎన్నికల్లోనే కుప్పంలో కొంత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు. సో, చంద్రబాబుని ఓడించడం వైసీపీకి పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.