MAA Association: ‘మా’ అధ్యక్షుడు కీలక నిర్ణయం… సభ్యులకు కీలక సూచనలు చేసిన మంచు విష్ణు

హైదరాబాద్‌ సంధ్య థియేటర్‌ తొక్కిసలాట, అల్లు అర్జున్‌ అంశాలు ఇప్పుడు సినీ పరిశ్రమను కుదిపేస్తున్నాయి. ఈ ఘటనల తర్వాత సినిమా వాళ్లకు సీఎం రేవంత్‌ రెడ్డి ఇచ్చిన వార్నింగ్‌ నేపథ్యంలో తెలంగాణలో సినీ పరిశ్రమ సంక్షోభంలో పడే పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమయంలో మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) సభ్యులకు అధ్యక్షుడు మంచు విష్ణు కీలక సూచనలు చేశారు. ప్రభుత్వాల మద్దతుతోనే చిత్ర పరిశ్రమ ఎదిగిందని ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు.

మన కళాకారులు ఎల్లప్పుడూ అన్ని ప్రభుత్వాల ప్రజాప్రతినిధులతో అనుబంధం, సాన్నిహిత్య సంబంధాలు కలిగి ఉంటారని తెలిపారు. గతంలో వివిధ ప్రభుత్వాల మద్దతుతోనే చిత్ర పరిశ్రమ ఎంతో ఎగిందని చెప్పారు. హైదరాబాద్‌లో తెలుగు సినీ పరిశ్రమ స్థిరపడటానికి అప్పటి సీఎం చెన్నారెడ్డి అందించిన ప్రోత్సాహం అత్యంత ముఖ్యమైనదని అన్నారు. ఈ విధంగా, ప్రతి ప్రభుత్వంతో మన పరిశ్రమకు ఎల్లప్పుడూ సత్సంబంధాలు కొనసాగుతూ వస్తున్నాయని తెలిపారు.

ఇటీవల జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని, సభ్యులందరూ సున్నితమైన విషయాలపై వ్యక్తిగత అభిప్రాయాలను బహిరంగంగా ప్రకటించవద్దని ‘మా’ సభ్యులకు మంచు విష్ణు విజ్ఞప్తి చేశారు. వివాదాస్పద అంశాల్లో పక్షాలు తీసుకోవద్దని సూచించారు. కొన్ని సమస్యలు వ్యక్తిగతమైనవని, మరికొన్ని విషాదకరమైనవని చెప్పారు. వాటిపై చట్టం తన దారిలో తను న్యాయం చేస్తుందని పేర్కొన్నారు. అలాంటి అంశాలపై మాట్లాడటం వల్ల అది సమస్యలను పరిష్కరించడానికి బదులుగా, సంబంధిత వ్యక్తులకు మరింత నష్టం కలిగించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ సమయంలో మనకు సహనం, సానుభూతి, ఐకమత్యం అవసరమని అన్నారు. తెలుగు మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఓ పెద్ద కుటుంబమనే సంగతి గుర్తుంచుకుందామన్నారు. ఏ సమస్యలు వచ్చినా, మనమంతా కలిసి ఎదుర్కొందామని చెప్పారు.