ఏ రాష్ట్రంలో అయినా స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో సక్రమంగా జరిగినప్పుడే గ్రామస్వరాజ్యం సిద్ధించినట్లు. కానీ, దురదృష్టవశాత్తూ కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు సంక్రమించినట్లు స్థానిక సంస్థలకు ఎలాంటి రాజ్యాంగబద్ధమైన అధికారాలు లేకపోవడంతో వీటిని ప్రభుత్వాలు సీరియస్ గా తీసుకోవు. ఒకదశలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దాదాపు పుష్కరకాలం పాటు అసలు స్థానిక సంస్థల ఎన్నికలే జరగలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్లు అధికారం వెలగబెట్టినపుడు ఒక్కసారి కూడా స్థానిక ఎన్నికలు జరపలేదు. అలాగే ఆయన మరోసారి విభాజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2018 లో షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన ఎన్నికలు కూడా జరగలేదు.
ఒక రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవలసింది రాష్ట్ర ప్రభుత్వమే తప్ప ఎన్నికల కమీషన్ కాదు. రాష్ట్రంలో పరిస్థితులను అంచనా వేసి, ఎన్నికలు జరిపేలా చర్యలు తీసుకోమని ప్రభుత్వం ఎన్నికల కమీషను ను కోరితే అప్పుడు ఎన్నికల కమీషన్ రంగంలోకి దిగి ఎన్నికలు జరిపించాలి. అంతే తప్ప ఎప్పుడు బడితే అప్పుడు తాను ఎన్నికలు జరుపుతాను అని ఎన్నికల సంఘం నిర్ణయిస్తే ఎలా కుదురుతుంది? స్థానిక సంస్థల ఎన్నికల పట్ల అంత చిత్తశుద్ధి ఉన్నవాడు రెండేళ్ళక్రితమే షెడ్యూల్ ప్రకారం ఎందుకు జరిపించలేదు?
రాష్ట్ర శాంతిభద్రతలను పర్యవేక్షించి, నియంత్రించే పోలీసు శాఖ అధిపతి ప్రభుత్వ నియంత్రణలో ఉంటారు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారయంత్రాంగం అధిపతి రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ నియంత్రణలో ఉంటారు. ఎన్నికలు జరిపే వాతావరణం ఉన్నదని వారిద్దరూ భావిస్తేనే ఎన్నికలు జరగాలి. రాష్ట్రంలో కరోనా ఉధృతి తగ్గలేదని, మరోసారి కరోనా విజృంభిస్తే ఆ నష్టాన్ని భరించలేమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పష్టం చేస్తుంటే ఎన్నికలు జరుపుతామని ఎన్నికల సంఘం ప్రకటించడం ఏమిటి? పైగా మార్చ్ లోగా ఎన్నికలు జరగకపోతే కేంద్రం ఇచ్చే నిధులు ఆగిపోతాయని ఎన్నికల కమీషనర్ భయాన్ని వ్యక్తం చెయ్యడం మరీ హాస్యాస్పదం. ఇదే కారణంతో ఎన్నికలు త్వరగా జరపమని రాష్ట్ర ప్రభుత్వం గత ఫిబ్రవరిలో కోరినపుడు కరోనా పేరుతో ఎన్నికలు వాయిదా వేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేడు ఆ సాకుతో ఎన్నికలు జరగాలని పట్టుపట్టడం చాలా దిగజారుడుతనం. అయినా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోతే నిమ్మగడ్డను ఏమి నొప్పి? కేంద్రం ఇచ్చే నిధుల వ్యవహారంతో ఆయనకేమిటి సంబంధం? బీహార్ లో ఎన్నికలు జరిగాయి కదా అని లాజిక్కు లాగుతున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ మోడీ గారి గుజరాత్ రాష్ట్రంలో కరోనా పేరు చెప్పి ఎన్నికలను మూడు నెలలపాటు ఎందుకు వాయిదా వేశారు?
ఇక నిన్న గవర్నర్ తో జరిగిన సమావేశంలో నిమ్మగడ్డను ఎలాంటి హామీ లభించినట్లు లేదు. జిల్లా కలెక్టర్లతో, అధికారులతో తలపెట్టిన వీడియో కాన్ఫరెన్స్ ను హఠాత్తుగా రద్దుచేసుకున్న నిమ్మగడ్డ, ఆ సమావేశాన్ని మళ్ళీ ఈరోజు జరుపుతానని ప్రధాన కార్యదర్శికి లేఖ రాయడం చూస్తుంటే ఆయన వెనుక ఏవో బలమైన రాజకీయశక్తుల ప్రభావం పడుతున్నట్లు స్పష్టంగా తెలిసిపోతుంది. ఎన్నికల సంఘ పరువు ప్రతిష్టలను మంటకలపడానికే నిమ్మగడ్డ సన్నద్ధం అవుతున్నట్లుంది. ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం తీసుకోవాలని సుప్రీమ్ కోర్ట్ ఆదేశించినప్పటికీ, ఆయన మాత్రం తనదైన రహస్య అజెండా ప్రకారమే వెళ్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇది ప్రజాస్వామ్య వ్యతిరేక విధానం. రాష్ట్ర ప్రభుత్వం కూడా రాజ్యాంగబద్ధమైనదే అని ఎన్నికల కమీషనర్ గుర్తించాలి. లేకపోతె రెండు వ్యవస్థల మధ్య ఘర్షణ తప్పదు. ఏ ఒక్కరు ఓడిపోయినా, ఆ దుష్ప్రభావం ఆ వ్యవస్థల మీద శాశ్వతంగా నిలిచిపోతుంది. కాబట్టి ఇకనైనా వాస్తవ పరిస్థితులను అర్ధం చేసుకుని, తన ఆధికారపరిధిని గ్రహించి ప్రభుత్వంతో సహకరించడమే నిమ్మగడ్డ రమేష్ కుమార్ కర్తవ్యమ్. కాదు కూడదు అని మంకుపట్టు పడితే ఆయన సాధించేది ఏమీ ఉండబోదు…అప్రతిష్ట తెచ్చుకోవడం తప్ప.
ఇలపావులూరి మురళీ మోహన రావు
సీనియర్ రాజకీయ విశ్లేషకులు