ఏపీలో స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టైన తర్వాత పవన్ కల్యాణ్ ఓపెన్ అయిపోయిన సంగతి తెలిసిందే. సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో ములాకత్ అనంతరం బయటకు వచ్చిన పవన్ పొత్తు విషయం పబ్లిక్ గా చెప్పేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ – జనసేన కలిసే పోటీచేస్తాయని ప్రకటించారు. అనంతరం జనసేనలో పెద్ద కుదుపు వచ్చింది.. పలువురు కీలక నేతలు రాజీనామాలు చేశారు.
ఆ సంగతి అలా ఉంటే… పవన్ కల్యాణ్ సీఎం అభ్యర్థిగా ఎన్నికలకు వెళ్తారని, జనసేనకోసం ఎన్నో త్యాగాలు చేస్తూ జనసైనికులు ముందుకు పోతుంటే… టీడీపీ కష్టాల్లో ఉంది కాబట్టి వారి కొసం నిలబడాలని నిర్ణయించుకున్నట్లు పవన్ ప్రకటించారు. దీంతో… జనసేనానిపై ఎన్నడూ లేనివిధంగా జనసైనికులు ఆఫ్ ద రికార్డ్ ఫైరయ్యారు. వారహి నాలుగో విడత యాత్రలో జనం పలచబడ్డారు!
ఈ నేపథ్యంలో… టీడీపీ అధినేత చంద్రబాబు జైలులో ఉన్న వేళ ఆయన తనయుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కొత్త మిత్రపక్షం జనసేనతో భేటీ కానున్నారు. దీనికోసం రాజమండ్రి సెంట్రల్ జైలు సమీపంలోనే వేదికను ఫిక్స్ చేశారని అంటున్నారు. ఈ నెల 23వ తేదీ అంటే సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఈ కీలకమైన భేటీ జరగనుంది. ఈ భేటీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ – నారా లోకేష్ చర్చలు జరుపుతారు.
ఈ విధంగా టీడీపీ జనసేన పార్టీల సమన్వయ కమిటీ మొదటి భేటీకి సర్వం సిద్ధం అయింది. ఈ భేటీలో ఉమ్మడి కార్యచరణపై ప్రణాళికలు రచించబోతున్నారని అంటున్నారు. ఇలా రాజకీయంగా తమదైన ప్రత్యేక ప్రావిణ్యం కలిగిన ఈ ఇద్దరు నేతలూ.. ఏపీలో ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటం మీద సీరియస్ గా చర్చిస్తారని సమాచారం.
ఈ భేటీలో పవన్ – లోకేష్ లతోపాటు జనసేన నుంచి ఆల్ ఇన్ వన్ నాదెండ్ల మనోహర్, టీడీపీ నుంచి మరో నలుగురైదుగురు సీనియర్లు పాల్గొంటారని సమాచారం. ఈ భేటీ అత్యంత కీలకమైనదని రెండు పార్టీల కార్యకర్తలు భావిస్తున్నారని అంటున్నారు. అయితే సీట్ల పంపకాల విషయం మాత్రం ఇప్పట్లో బహిర్గతం చేయరని అంటున్నారు. ఫలితంగా… జనసైనికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని భావిస్తున్నారని అంటున్నారు.
ఇక ఇంక కీలకమైన భేటీ అటు హైదరాబాద్, ఇటు అమరావతి లో కాకుండా రాజమండ్రిలో ఏర్పాటు చేయడం వెనుక మరో ప్లాన్ ఉందని చెబుతున్నారు. ఈ భేటీ అనంతరం వీరి భేటీ వేదికకు సమీపంలోని సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుతో వీరు ములాకత్ అవుతారని అంటున్నారు. ఏది ఏమైనా… పొత్తు ప్రకటన తర్వాత ఈ రెండు పార్టీల మధ్య కీలక భేటీ జరగబోతోంది!