పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదని సామెత! ఇదే సమయంలో ఈ సామెతను కాపుసామాజికవర్గంలో ఉన్న ప్రధానమైన, పలుకుబడి ఉన్న, కీలక నేతలు జనసేనకు పనికిరారనేలా పవన్ ఆలోచిస్తుంటారని పలువురు అభిప్రాయపడుతుంటారు. ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం విషయంలో మిథున్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
అవును… ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమ నేతల్లో కీలకమైన వ్యక్తి. మరిముఖ్యంగా ఉభయ ఉమ్మడి గోదావరి జిల్లాల్లో మరింత కీలక నేతగా ఆయనకు పేరుంది. అలాంటి ముద్రగడను రాజకీయంగా ఉపయోగించుకోకపోయినా పర్లేదు కానీ… పవన్ ఆయనతో శతృత్వం పెట్టుకున్నంత పనిచేశారు. ఫలితంగా ఆయన లేఖాస్త్రాలకు బలయ్యారు.
తనపై వచ్చిన విమర్శలకు సమాధానాలు చెబుతూనే… పవన్ కు కాపు సామాజికవర్గంపై ఉన్న బాధ్యతను, గౌరవాన్ని ప్రశ్నిస్తూ ముద్రగడ ఆ లేఖల్లో పేర్కొన్నారు. దీంతో సమాధానం చెప్ప లేక సైలంట్ అయిపోవడం పవన్ వంతైంది.
ఈ పరిస్థితుల్లో ముద్రగడ వైసీపీలో చేరుతున్నారంటూ ఒక ప్రచారం తెరపైకి వచ్చింది. అయితే తాజాగా ఈ విషయాలపై మిథున్ రెడ్డి స్పందించారు. ఆయన నిజంగా వైసీపీలోకి వస్తున్నారంటే స్వాగతిస్తామని పేర్కొన్నారు. అయితే అది పూర్తిగా తన స్థాయి వ్యవహారం కాదని చెబుతూ ముద్రగడ లెవెల్ ని మరింత పెంచే ప్రయత్నం చేశారు.
అవును… ముద్రగడ పద్మనాభం లాంటి నాయకులు పార్టీలో చేరితే పార్టీ బలోపేతం అవుతుందని చెప్పిన ఉభయగోదావరి జిల్లాల కో ఆర్డినేటర్, ఎంపీ మిథున్ రెడ్డి… ఆస్థాయి నేతలు పార్టీలో చేరే విషయమై సీఎం జగన్ స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు.
దీంతో… ముద్రగడను పవన్ ట్రీట్ చేసిన విధానాన్నికీ.. మిథున్ రెడ్డి ఇస్తున్న గౌరవానికీ ఎంత తేడా అనే చర్చ తెరపైకి రావడం గమనార్హం.
ఇదే సమయంలో పవన్ చేసిన కామెంట్లపై కూడా మిథున్ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలో ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు క్లారిటీ లేదని ఎద్దేవా చేసిన మిథున్ రెడ్డి… చంద్రబాబు నాయుడుని సీఎం చేసేందుకు పవన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడని అన్నారు. అభిమానులను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్దిపొందాలని పవన్ కళ్యాణ్ ఎదురు చూస్తున్నారని తెలిపారు.