టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడి మీద వైసీపీ నేత, మంత్రి రోజా సెటైర్ వేశారు. కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు వదిలేశారు.. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది.. బీజేపీని చంద్రబాబు తగులుకుంటే.. అంతే సంగతి.! అన్నది మంత్రి రోజా ఉవాచ.!
చంద్రబాబుని పదే పదే ఐరన్ లెగ్.. అనడంలో రోజా తర్వాతే ఎవరైనా. ఈ విషయంలో రోజాకి మాజీ మంత్రి కొడాలి నాని పోటీకి వస్తారేమో.! అయినా, కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకీ తెలుగుదేశం పార్టీకీ లింకేంటబ్బా.?
తెరవెనుకాల టీడీపీతోపాటు వైసీపీ కూడా కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కష్టపడ్డాయి.. అదీ తెలుగువారి ఓట్లు కీలకంగా వున్న ప్రాంతాల్లో. ఎక్కడా ఆయా పార్టీల జెండాలు కనిపించలేదుగానీ, తమ మద్దతుదారులంతా ఆయా పార్టీలకు అనుకూలంగా ఓటేసేలా టీడీపీ, వైసీపీ.. తెరవెనుకాల వ్యూహాత్మకంగా వ్యవహరించాయి.
వైసీపీ, టీడీపీ మాత్రమే కాదు.. ఈ విషయంలో జనసేన కూడా తనవంతు పాత్ర పోషించడం గమనార్హం. అయితే, ఎక్కడా టీడీపీ, జనసేన, వైసీపీ.. తమ ఉనికిని కర్నాటక ఎన్నికల్లో కనిపించకుండా జాగ్రత్తపడ్డాయి.
ఇంతకీ, చంద్రబాబుది ఐరన్ లెగ్గా.? అదే నిజమైతే, 2014 ఎన్నికల్లో టీడీపీ – బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి బీజేపీ.. కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో, రాష్ట్రంలో టీడీపీ – బీజేపీ కలిసి అధికారం పంచుకున్నాయి. అదే ఈక్వేషన్ 2024లో రిపీట్ అవుతుందని చంద్రబాబు ఒకింత ఉత్సాహం చూపిస్తున్నారని వైసీపీనే చెబుతోందాయె.! సెటైర్లు కూడా వేస్తోందాయె.!
కాగా, రోజా వేసిన సెటైర్ మీద తెలుగు తమ్ముళ్ళు గుస్సా అవుతున్నారు. రోజానే ఐరన్ లెగ్.. అంటూ ఎదురుదాడికి దిగుతున్నారు.