అవేం శ్వేత పత్రాలు, నిండా అత్మ స్తుతి పరనింద

 

(యనమల నాగిరెడ్డి)

 

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు తన రాజకీయ ఎత్తుగడలలో భాగంగా విడుదల చేస్తామని ప్రకటించి విడుదల చేసిన శ్వేతపత్రాలలో వాస్తవ పరిస్థితులను వివరించడానికి బదులుగా “ఆత్మస్తుతి-పరనిందలకే” ఎక్కువ ప్రాధాన్యమిచ్చారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి వివరించిన అంశాలలో “తాను తన భాద్యత నుంచి  తప్పించుకుంటూ అటు బీజేపీని, వైస్సార్ పార్టీని, జనసేనను విమర్శించడానికి, ఇతరులపై నిందలు వేయడానికి ” మాత్రమే వీటిని ఉపయోగ పెట్టడం శోచనీయమని కొందరు మేధావులు అంటున్నారు.

“కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పనికిమాలిన విభజన చట్టం తెచ్చిఆంధ్రప్రదేశ్ ను అడ్డగోలుగా విభజించి ఈ ప్రాంతానికి తీరని అన్యాయం చేసిందని” వాపోయిన చంద్రబాబు ఆ పనికిమాలిన చట్టాన్ని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు  అమలు చేయలేదని ఆరోపించడంలో ఔచిత్యమేమిటని రాయలసీమ మేధావుల సంఘం అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి ప్రశ్నిస్తున్నారు.

“విభజన చట్టం అమలు చేయడం కేంద్రం భాద్యత. అమలు చేయించుకోవడం రాష్ట్ర ప్రభుత్వ భాద్యత. రెండు ప్రభుత్వాలు కలసి ఉన్నన్ని రోజులు ఈ భాద్యత ఎవరికీ గుర్తు రాలేదని, భందం తెగిపోయిన తర్వాత బాబుగారికి కేంద్ర ప్రభుత్వ భాద్యత గుర్తు రావడంలో” ఆంతర్యం ఏమిటో బాబుకే  తెలియాలని పురుషోత్తం అభిప్రాయపడుతున్నారు. .

 

భాద్యత మరచిన కేంద్రం   

“చిన్న రాష్ట్రాలకే” కట్టుబడి ఉన్నామని ప్రకటించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసేంత  వరకు అహర్నిశాలు నిద్రాహారాలు మరచి కృషి చేసి రాష్ట్ర విభజనలో తన వంతు పాత్ర పోషించిన బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే, తమ నేతలు పట్టుపట్టి అప్పటి కాంగ్రెస్ పరభుత్వంతో ఇప్పించిన హామీలను తుంగలో తొక్కారు”. తమ చిరకాల మిత్రుడుగా ప్రకటించుకున్న బాబు గారి వాయిద్యాలకు బీజేపీ నాయకత్వం, బీజేపీ సంగీతానికి బాబుగారు ఒకరిని మించి ఒకరు భజన చేశారు. తీరా ఆ పొత్తు  చెడిపోయాక ఒకరిమీద ఒకరు మరీ పచ్చిగా ఆరోపణలు గుప్పిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు.

రాజధాని స్థలం ఎంపిక- నిర్మాణానికి నిధులు

కేంద్రం నియమించిన కమిటీ నివేదిక ఆధారంగా కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి రాజధాని స్థలం ఎంపిక చేయడం కేంద్ర ప్రభ్యత్వ భాద్యత. అయితే కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ నివేదికకు వ్యతిరేకంగా కేంద్రం (మౌఖిక) అనుమతితో బాబుగారు అమరావతిని ఎంపిక చేశారు. (అస్మదీయులకోసం ఆయన మూడు పంటలు పండే భూములు తీసుకుని(లాక్కొని) రైతుల కొంప ముంచారని గిట్టనివారంటారు). కేంద్రం మంజూరు చేసిన 1500 కోట్లు తాత్కాలిక నిర్మాణాలకు ఖర్చు చేసి కేంద్రం నిధులివ్వలేదనడం పసలేని వాదనే. నమూనాలు పూర్తి చేయకుండా, డిపిఆర్ లు తయారు చేయకుండా ఏ ప్రాతిపదికన రాజధాని నిర్మాణానికి  40 వేల కోట్లు కావాలని కోరుతున్నారో ఏలినవారికే తెలియాలి.

కడప ఉక్కు- దుగ్గరాజపట్నం పోర్ట్

“కమిటీని నియమించి కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఆరు నెలలోగా నిర్ణయం తీసుకుంటామని చట్టంలో కాంగ్రెస్ పెట్టిన మెలిక” ఆధారంగా బీజేపీ ప్రభుత్వం కడప ఉక్కుకు మొదట్లోనే మొండి చేయి చూపింది. ఇందులో భాగంగా చంద్రబాబు ప్రభుత్వం కూడా తన వంతుగా ముంపుమండలాలలో ఉన్న “కుక్కులాపురం గనులను” విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేటాయించాలని కేంద్రానికి లేఖ రాశారు.  అనంతపురం జిల్లాలో ఏపీఎండీసీ పరిధిలోని “ నేమకల్లు” ఖనిజాన్ని విశాఖకు తరలించడానికి ఎండి వెంకయ్యచౌదరి చొరవతో ఏపీఎండీసీ విశాఖ స్టీల్ ప్లాంట్ జాయింట్ వెంచర్ ఏర్పాటుచేశాయి కూడా(ఆంధ్రజ్యోతి దినపత్రిక 2016 నవంబర్ 8న రాసిన కథనంమేరకు). కడప ఉక్కు కోసం బాబు చేసిందేమిటి? ఎంపీ రమేష్ లాంటి వారితొ దీక్షలు చేయించటం, కేంద్రం పై విమర్శలు చేయడం తప్ప, ఈ ఫ్యాక్టరీ సాధించడానికి, కేంద్రాన్ని ఒప్పించడానికి ఆయన చేసింది సూన్యం. ప్రస్తుతం ప్రజల కన్నీళ్లు కోసం పునాది రాయి వేస్తున్నారు. కట్టడం ఎపుడో దేవుడికి మాత్రమే తెలుసు.     

దుగ్గరాజపట్నం నౌకాశ్రయం 2018 చివరికి మొదటి దశ పూర్తి కావాల్సివుంది. మొదలు పెట్టనే లేదు. ప్రారంభించడానికి కేంద్రం సిద్ధపడలేదు. రాష్ట్రం పట్టించుకోలేదు.  మరి దీనికి భాద్యులెవరు?

ప్రత్యేకహోదా-ప్రత్యేకప్యాకేజి  

ఐదేళ్లు ప్రత్యేక హోదాఇస్తామంటే కాదు- కాదు పదేళ్ళివ్వాలని బలంగా గర్జించిన బీజేపీ నాయకత్వం అధికారం చిక్కిన వెంటనే పల్లవి మార్చింది. నీ(టి)తి  ఆయోగ్ చెప్పింది కాబట్టి ఏపీకి హోదా ఇవ్వలేము ప్రత్యేక ప్యాకేజి ఇస్తామన్నది కేంద్రం. ఇట్టాంటి ప్రభుత్వాన్ని, ప్రధానిని తన 36 సంవత్సరాల ఇండస్ట్రీలో చూడలేదని శాసనసభ సాక్షిగా గంతులు వేసిన ముఖ్యమంత్రి హోదానే ముద్దు అంటూ కొత్త రాగం తీయడం ఆయనకే చెల్లింది. అప్పట్లో నీతిఆయోగ్  చెప్పలేదని ఆధార పూర్వకంగా ప్రతిపక్ష నేత జగన్ నిరూపించినా చంద్రబాబు పట్టించుకోలేదు. పైగా జగన్ పై ఆయన, ఆయన భజన బృందం తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇపుడేమో బీజేపీ మోసం చేసింది కాబట్టి “హోదా” ఇస్తామంటున్న కాంగ్రెస్ ను భుజానికి ఎత్తుకుంటున్నానని ప్రకటిస్తూ రాష్ట్రానికి అన్యాయం చేసింది బీజేపీ అని ముక్తాయిస్తున్నారు.  

ఉమ్మడి ఆస్తులు

చంద్రబాబు గారి లెక్కమేరకు ఉమ్మడి ఆస్తుల విలువ సుమారు 2. 36 లక్షల కోట్లు(ఎక్కువ హైదరాబాద్ లోనే). రెండు రాష్ట్రాలు సహకరించుకుంటేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఎపి ప్రభుత్వం దూరదృష్టితో వ్యవహరించి ఉమ్మడి రాజధానిలో ఉన్న ఆస్తులను సామరస్యపూర్వకంగా పంచుకోవాల్సిఉంది. ఆ పని చేయకుండా తన రాజకీయ ప్రయోజనాలకోసం చంద్రబాబు “ఉమ్మడి రాజధానిని వదులుకోవడం” తెలంగాణా తో ఘర్షణ వైఖరి తీసుకోవడంతో ఎపికి తీరని నష్టం వాటిల్లింది.  కేసీఆర్ ను తిడితే ఏమీ వస్తుందో బాబు గారికే తెలియాలి.

వెనుకపడిన జిల్లాల అభివృద్ధికి నిధులు.

వెనుకపడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు విభజన చట్టంమేరకు ప్రత్యేక ప్యాకేజి ఇవ్వాల్సి ఉంది. ఈ అంశాన్ని అటు కేంద్ర, ఇటు రాష్ట్రం పట్టించుకోనేలేదు. దేశంలో వెనుకపడిన జిల్లాల కోసం ఎప్పటినుంచో కేంద్రం ఇస్తున్న జిల్లాకు 50 కోట్లు ఇపుడు ఇచ్చింది. ఆ తర్వాత నిలిపింది. దీనిపైన తీవ్రంగా స్పందించే టీడీపీ నాయకత్వం “చట్టంలో చెప్పిన వెనుకపడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజి గురించి ఎందుకు అడగలేదో? ఇప్పుడెందుకు గర్జిస్తున్నారో?” ఇప్పటి వరకూ  స్పందించని ముఖ్యమంత్రి, పట్టించుకోని ప్రతిపక్ష నేత జవాబు చెప్పాల్సి ఉంది.

పోలవరం ప్రాజెక్ట్

చట్టం ప్రకారం కేంద్రం నిర్మించి ఇవ్వాల్సిన “పోలవరం ప్రాజెక్ట్ ను” తగుదునమ్మా అంటూ కేంద్రం నుండి లాక్కొని, తన భుజస్కందాలపై ఉంచుకున్న చంద్రబాబు బీజేపీ ఎత్తులలో చిత్తయ్యారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి నాబార్డ్ నిధులు, ఇతర రుణాలు సేకరించుకోడానికి అనుమతి ఇస్తామంటూ చెప్పిన బీజేపీ మాటలకు, తనకు, తనవారి ప్రయోజనాలే ముఖ్యంగా భావించిన బాబు దీంట్లో చిక్కుక పోయారు. ప్రాజెక్ట్ అంచనాలను 16వేలకోట్ల నుండి అనేక దశలలో పెంచుకుంటూ వెళ్లి 50 వేల  కోట్లకు చేర్చారు. సమయం కోసం ఎదురు చూస్తున్న బీజేపీ నాయకత్వం బాబును బాగా ఇరికించి రాజకీయ తమాషా చూస్తున్నది. ఈ ప్రాజెక్టును ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన క్రింద చేర్చి ఉంటె బీజేపీ తీసిన గొయ్యిలో బాబు గారే స్వయంగా పడినట్లే.

ఇకపోతే కేంద్రం రాష్ట్రాన్ని మోసం చేస్తున్నదని, ప్రత్యేక హోదా కావాలని ప్రతిపక్ష నేత జగన్ ఎంతగా అరచినా, ప్రజాసంఘాలు గీపెట్టినా, ప్రజలు ఉద్యమించినా ముఖ్యమంత్రి అప్పట్లో పట్టించుకోకపోగా, వారిని అణచివేయడానికి తన పోలీసు బలగాలను ప్రయోగించారు. ఇపుడేమో నిప్పులు కక్కుతున్నారు. ఇంతకు ఎవరు తీసిన గోతిలో వారే పడతారనడానికి బాబు గారి కి మించిన ఉదాహరణ ప్రస్తుతం దొరకదు.”గతజల సేతు బంధనం”  ఇపుడు శ్వేతపత్రం విడుదల చేసినా, బ్లాక్ పేపర్ విడుదల చేసినా ఫలితం మాత్రం సూన్యం. ఏమైనా రాజకీయాలకు ఉపయోగపడితే చెప్పలేము. ప్రజలకు ఒరిగేది మాత్రం నోటిజల్లు మాత్రమే. (గిట్టనివారు బాబు గారిని తిట్టడానికి, అయిన వారు పొగడటానికి తప్ప ఈ పత్రాలు దేనికీ పనికిరావు అంటున్నారు విజ్ఞులు).