ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి మరో శుభవార్త అందింది. దేశవ్యాప్తంగా పట్టణ అభివృద్ధి ప్రాజెక్టులకు సహకరించే హడ్కో సంస్థ, అమరావతి ప్రాజెక్ట్‌కు రూ.11 వేల కోట్ల నిధుల విడుదలకు అంగీకరించింది. ఈ నిధుల మంజూరుతో రాజధాని నిర్మాణ పనులకు మరింత వేగం చేకూరనుంది.
అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే హడ్కోతో సంప్రదింపులు జరిపిన ప్రభుత్వం, నిధుల కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. గత సంవత్సరం జరిగిన సమావేశాల్లో హడ్కో మద్దతు పొందేందుకు ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ పలు చర్చలు నిర్వహించారు. ఈ చర్చల ఫలితమే నిధుల మంజూరు అని చెబుతున్నారు.
హడ్కో బోర్డు ఇటీవల ముంబయిలో సమావేశమై అమరావతి నిర్మాణానికి నిధుల కేటాయింపుపై చర్చించింది. ప్రాజెక్ట్ ప్రతిపాదనలతో పాటు నిధుల వినియోగం తీరుపై సమగ్రమైన వివరాలు చూసిన బోర్డు సభ్యులు, నిధుల విడుదలకు ఆమోదం తెలిపారని సమాచారం. నిధులు విడుదల కావడం వల్ల ప్రాజెక్ట్ పనులు పునరుద్ధరణ దిశగా వెళ్లనున్నాయి.
నిధుల ఆమోదంతో రాజధాని నిర్మాణ పనుల్లో ఊపొచ్చే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ప్రారంభమైన పలు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు హడ్కో మద్దతుతో వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అమరావతిని బలమైన మౌలిక సదుపాయాలతో నిర్మించేందుకు ఈ నిధులు కీలకంగా మారనున్నాయి. ఈ నిధుల విడుదలతో అమరావతి భవిష్యత్తు మరింత ప్రకాశవంతం అవుతుందని, త్వరలోనే కీలక ప్రాజెక్టులు పూర్తి కానున్నాయని ప్రభుత్వం ప్రకటించింది.