ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పాలనలో ఆర్థిక వ్యవస్థ కుదేలైందని, బీహార్ కంటే దారుణ పరిస్థితి నెలకొన్నట్లు విమర్శించారు. తాను మాట తప్పడం ఇష్టపడనని, ఆర్థిక స్థితి పటిష్ఠం కాకుండా పథకాలను అమలు చేయడం సాధ్యం కాదని ప్రజలకు వాస్తవం వెల్లడించారు.
చంద్రబాబు మాట్లాడుతూ విశాఖ ఉక్కు, అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు కేంద్రం నిధులు ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే ఆ నిధులను ఇతర అవసరాలకు మళ్లించడం కుదరదని స్పష్టంగా తెలిపారు. “డబ్బు ఉంటే పథకాలు వెంటనే అమలు చేస్తాం, లేకుంటే అప్పు చేసి మాట నిలబెడతాం,” అని ఆయన ధృడంగా చెప్పారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

చంద్రబాబు మాట్లాడుతూ, గత ఐదేళ్ల కాలంలో రాష్ట్రం విలువైన సమయాన్ని కోల్పోయిందని, వైసీపీ పాలనలో రూ.9.5 లక్షల కోట్ల అప్పులు పెరిగినట్లు వివరించారు. ఈ అప్పులు, వాటికి వడ్డీలు చెల్లించడమే ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారిందని చెప్పారు. 2019 నాటి వృద్ధి రేటు కొనసాగి ఉంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు.
తమ ప్రభుత్వం ఇప్పుడు అన్ని వ్యవస్థలను గాడిలో పెడుతూ సంక్షేమ పథకాల అమలులో ఎక్కడా వెనుకడుగు వేయకూడదని నిర్ధారించుకుంటోందని చంద్రబాబు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాష్ట్ర ఆర్థిక స్థితిని పటిష్ఠం చేసే దిశగా కృషి చేస్తున్నామని చెప్పారు.

