ఐదేళ్ళ జగన్ పాలన అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పాలన ఎలా ఉంటుందో అనే సందేహాలు గట్టిగానే వచ్చాయి. మూడు పార్టీల నేతృత్వంలో ఎలాంటి గొడవలు రాకుండా ఉండడం అంత ఈజీ కాదని అందరూ భావించారు. ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడూ నెలలు పూర్తయ్యింది. ఈ కాలంలో వరదలు, తిరుపతి తొక్కిసలాట వంటి అపశ్రుతులు ఎదురైనప్పటికీ, ప్రజలకు ఇచ్చిన హామీల్లో కొన్ని అమలు చేసింది.
ఉచిత గ్యాస్ పథకానికి శ్రీకారం చుట్టగా, పింఛన్ల పెంపు ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంది. అయితే, కొన్ని ముఖ్యమైన అంశాలు ఇప్పటికీ ప్రభుత్వం దృష్టిలోకి రాకపోవడం ప్రజల్లో మిశ్రమ భావాలను కలిగిస్తున్నాయి. ప్రభుత్వం సంక్షేమం కంటే అభివృద్ధి అంశాలను ముందుకు తీసుకువెళ్లాలని చూస్తోంది. అమరావతి ప్రాజెక్టు, పోలవరం, విశాఖ రైల్వే జోన్ వంటి ప్రాజెక్టులను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నది.

అలాగే, పెట్టుబడులను ఆకర్షించడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ చర్యలు ప్రజలకు ఆశలు కలిగిస్తున్నప్పటికీ, కొన్ని కీలక పథకాలపై స్పష్టత లేకపోవడం నిరాశ కలిగిస్తోంది. ప్రజల దృష్టిలో అత్యంత ముఖ్యమైన మూడు పథకాలు ఇప్పటికీ నిశ్చితత పొందలేకపోయాయి. ఉచిత బస్సు సేవలు, మహిళలకు రూ.1500 ఆర్థిక సహాయం, రైతులకు భరోసా పథకాలు ఇప్పటివరకు అమలు దశకు చేరలేదు. ప్రభుత్వం వీటిపై చర్యలు తీసుకుంటుందనే సంకేతాలు పంపినా, ప్రజల్లో అసంతృప్తి అణగలేదని చెప్పాలి.
అయితే, ఉచిత ఇసుక పథకం అమలులో పారదర్శకత లేకపోవడం, బెల్ట్ షాపులు పూర్తిగా తొలగించలేకపోవడం వంటి అంశాలు ప్రభుత్వంపై ప్రజల నమ్మకాన్ని కొంత తగ్గిస్తున్నాయి. ఈ అసంతృప్తిని ప్రతిపక్షం భారీగా ప్రచారం చేస్తోంది. కానీ, ఇప్పటికిప్పుడు చూస్తే, వ్యతిరేకత పూర్తిగా పెరగకపోవడం ప్రభుత్వానికి కలిసొచ్చే అంశం. కూటమి ప్రభుత్వానికి ముందు ఇంకా ఎన్నో సవాళ్లు ఉన్నా, ఇప్పటికే చేపట్టిన చర్యలు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టగలవా? అనే ప్రశ్నపై సమాధానం ప్రభుత్వ తీరుపైనే ఆధారపడి ఉంటుంది. అసంతృప్తిని తగ్గించడానికి సంక్షేమ పథకాల అమలు వీలైనంత వేగంగా చేపట్టాల్సిన అవసరం ఉంది.

