గతకొన్ని రోజులుగా జమిలి ఎన్నికలంటూ చంద్రబాబు సందడి చేసిన సంగతి తెలిసిందే. ఒకదశలో ముందస్తు ఎన్నికలు అని డప్పుకొట్టిన చంద్రబాబు… జమిలీ ఎన్నికల అంశం కూడా తెరపైకి తెచ్చారు. జగన్ పై వ్యతిరేకత ఉంది.. ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ తనకు పడిపోతాయని ఆయన నమ్మకం.
ఇలా ఇప్పుడు బాబు చెప్పడమే కాకుండద.. గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశ రాజకీయాల్లో ఈ మాట నానుతూనే ఉంది. అయితే తాజాగా ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఈ అంశం మరోసారి చర్చకు వచ్చింది. దీంతో ఈ ఎన్నికలపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పార్లమెంటులో ఈ మేరకు ఒక ప్రకటన చేశారు.
అవును… జమిలి ఎన్నికలు నిర్వహించడం కష్టసాధ్యమని.. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం సాధ్యంకాని పని అని కేంద్రం పార్లమెంటులో తేల్చి చెప్పింది. జమిలి ఎన్నికలపై పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
ఇదే సమయంలో జమిలి ఎన్నికలతో లాభాలు ఉన్నప్పటికీ… ఒకేసారి లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ సాధ్యమయ్యే పని కాదని మంత్రి వ్యాఖ్యానించారు. ఈ జమిలీ ఎన్నికల వల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో.. అవరోధాలు కూడా అన్నే ఉన్నాయని స్పష్టం చేశారు. అంతేకాకుండా జమిలి కోసం 5 కీలకమైన రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉందని మంత్రి తెలిపారు.
ఇదే క్రమంలో సెక్యూరిటీ విషయాలు కూడా మంత్రి ప్రస్థావించారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిపితే.. ఒకేసారి అన్ని చోట్లా భద్రతా బలగాల మోహరింపు సాధ్యం కాదని న్యాయశాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం పరిశీలన చేసిందని తెలిపారు. ఈ చర్చల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ తో సహా భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరిపినట్లు తెలిపారు.
కాగా… మోడీ ప్రధానమంత్రి పదవి చేపట్టిన తర్వాత జమిలి ఎన్నికల అంశం చాలాసార్లు చర్చకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వీటి నిర్వహణకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రాలేదు. ఇదే సమయంలో ప్రజలు ఇచ్చిన పదవీకాలాన్ని ముందుగా వదులుకోవడానికి అధికారంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ అంగికరించలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది.