కరోనా కంటే భయంకరమైనది మద్యం. ప్రజలకు ముఖ్యంగా పేద ప్రజల ఆరోగ్యాన్ని మరియు ఆర్థిక స్థితిగతుల్ని తారుమారు చేయగల శక్తి మద్యానికి మాత్రమే ఉంది. అనేక రాష్ట్రాల్లో అనేక సార్లు ఈ మద్యపానాన్ని నిషేధించాలని ఎన్నో ప్రభుత్వాలు మరియు నాయకులు ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఈరోజు భారతదేశంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు అవుతున్న రాష్ట్రాలు చాలా చాలా తక్కువ. అందులో ప్రధానమైన రాష్ట్రం గుజరాత్. ప్రధానమంత్రి సొంత రాష్ట్రం. సంపూర్ణ మద్యపాన నిషేధం మాంసాహారం నిషేధం అమలవుతుంది. కానీ మద్యం మాంసం కోరుకునే వాళ్లకి కోరుకున్న చోట దొరకక పోవచ్చు కానీ బలంగా కోరుకుంటే కచ్చితంగా మద్యం దొరికే వెసులుబాటు ఆ రాష్ట్రంలో ఉంది. కాబట్టి సంపూర్ణ మద్యపాన నిషేధం అనేది కేవలం ఒక మిధ్య మాత్రమే.
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 1994 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీరామారావు గారు అఖండ విజయం సాధించారు. ఆ విజయానికి ప్రధాన కారణం రెండు రూపాయలకు కిలో బియ్యం, 50 రూపాయలకు హార్స్ పవర్ విద్యుత్, మరియు సంపూర్ణ మద్యపాన నిషేధం. ఈ మూడు వాగ్దానాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశానికి 220 పై చిలుకు సీట్లు సాధించి పెట్టింది.
ఎన్టీరామారావుగారు మద్యపానం నిషేధించాలని దృఢనిశ్చయంతో మద్యపాన నిషేధాన్ని అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేశారు. అయితే ఎన్టీరామారావు ప్రభుత్వం పడి పోయి చంద్రబాబు 1995లో ముఖ్యమంత్రి అయిన కొన్నాళ్ళకు సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని ఎత్తివేశారు. అప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 20 సంవత్సరములుగా ఏ పార్టీ గాని ఏ నాయకుడు గాని తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఆ వాగ్దానం చేయలేదు.
అయితే వైయస్ జగన్మోహన్ రెడ్డి 2014లో విడుదల చేసిన మేనిఫెస్టో అలాగే 2019లో విడుదల చేసిన మేనిఫెస్టోలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏర్పడితే దశలవారీగా మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తానని హామీ ఇచ్చారు. 2014లో అధికారం రాలేదు. 2019 లో అధికారం లోకి వచ్చిన తర్వాత విడతలవారీగా మద్యపాన నిషేధాన్ని అమలుపరిచే క్రమంలో తొలిమెట్టుగా భారీగా మద్యం రేట్లు పెంచారు. అలాగే మద్యాన్ని ఒక లాభాపేక్ష ఉన్న వ్యాపారంగా కాకుండా ప్రైవేటు వ్యక్తుల నుంచి గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిచే విధానాన్ని తీసుకువచ్చారు
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సర కాలంలో మద్యపాన విక్రయాలు చూస్తే మద్యం అమ్మకాల వాల్యూమ్ అయితే గణనీయంగా తగ్గింది. కానీ ప్రభుత్వానికి రాబడి గతం కంటే పెరిగింది. ఈ గణాంకాలతో ప్రతిపక్ష తెలుగుదేశం అధికార వైఎస్ఆర్సిపి రెండూ కూడా వారికి అనుకూలంగా మాట్లాడడం సమర్థించుకోవడం చేస్తూ వస్తున్నాయి. గతం కంటే మీకు మద్యంలో ఆదాయం ఎక్కువ వస్తున్నప్పుడు మీరు సంపూర్ణ మద్యపాన నిషేధం ఎలా అమలు చేస్తారని తెలుగుదేశం ప్రశ్నిస్తోంది. అలాగే ప్రభుత్వం గతం కంటే తక్కువ అమ్మకాలు జరిగాయి కాబట్టి తాగడం తగ్గింది అనే వాదన చేస్తోంది.
ఈ నేపథ్యంలో కరోనా వల్ల 40 రోజులు లాక్ డౌన్ ఉన్న రాష్ట్రంలో లో ఆదివారం రోజు మద్యం దుకాణాలు తెరవడానికి అనుమతి లభించింది. 40 రోజుల తర్వాత మధ్యాహ్నం దొరుకుతుందనే ఒక వార్తతో మద్యం ప్రియులు కరోనా భయాన్ని పక్కనబెట్టి మద్యం దుకాణాల మీద ఎగబడ్డారు. ఇటువంటి స్పందన వస్తుందని ఊహించని ప్రభుత్వం మద్యం దుకాణాలు ప్రజల తాకిడి తట్టుకోవాలంటే మద్యాన్ని అధిక ధరలకు విక్రయించాలని నిర్ణయించింది. ప్రస్తుతం వున్నా ధర మీద 70 శాతం అధికంగా అమ్మాలని నిర్ణయించింది. దీనిని ప్రశ్నించిన ప్రతిపక్షాలకు ప్రభుత్వం నుండి వస్తున్న సమాధానం, అధిక ధర వల్ల మద్యం కొనడం తగ్గిస్తారని, అది దశలో వారి మద్యపాన నిషేధానికి తోడ్పడుతుందని వివరణ ఇస్తున్నారు.
ఇది లోతుగా పరిశీలిస్తే ప్రభుత్వం చెబుతున్న వాదనలో డొల్లతనం బయట పడుతుంది. మద్యం వల్ల ప్రధానంగా ఎదురయ్యే దుష్ఫలితాలు రెండు విధాలుగా వున్నాయి . ఒకటి ప్రజల ఆరోగ్యం, రెండు ప్రజల ఆర్థిక పరిస్థితి. ఈ రేట్లు పెంచడం వల్ల గతంలో రెండు సీసాలు మద్యం కొనేవాడు ఇప్పుడు అదే మొత్తానికి ఒక సీసా కొనుగోలు చేసి తాగుతున్నాడు. రెండు సీసాలు తాగేవాడు ఒక సీసా తాగితే ఆరోగ్యం ఎంత మెరుగుపడుతుందో నిర్దిష్టంగా చెప్పలేం గానీ అతని ఆర్థిక పరిస్థితి అయితే మాత్రం ఖచ్చితంగా మునుపటి కంటే మెరుగ్గా ఉండదు. కాబట్టి ధర పెంచడం అనేది ప్రజలకి ఎటువంటి మేలు చేయడం లేదు. అలాగే ప్రభుత్వం అనుకుంటున్నా మద్యపాన నిషేధం అమలకు కూడా తోడ్పడటం లేదు. ఎందుకంటే మద్యం అందుబాటులో ఉంటే అప్పు చేసైనా తాగేవారు తాగుతారు.
నిజానికి సంపూర్ణంగా మద్యపానాన్ని నిషేధించాలని అనుకోవడం హాస్యాస్పదం. ఎందుకంటే మద్యపాన నిషేధం ప్రజలు స్వచ్ఛందంగా ఆహ్వానించే కార్యక్రమం ఏమి కాదు. దీన్ని బలవంతంగా ప్రజల మీద రుద్దాలి. అలా చేసినప్పుడు దాని వలన ఎన్నో దుష్పరిణామాలు ఎదురవుతాయి. నాటుసారా గంజాయి లాంటి అనేక ప్రత్యామ్నాయాలు రంగప్రవేశం చేసే అవకాశం ఉంది. మళ్లీ వీటి కోసం పెద్ద ఎత్తున ప్రభుత్వ యంత్రాంగం, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పని చేయవలసి ఉంటుంది. మరి ఈ సమస్యకు ఆచరణాత్మకమైన పరిష్కారం లేదా అంటే ఉంది.
ప్రభుత్వం మద్యం రేటు పెంచడం తో పాటు మద్యం అందుబాటులో లేకుండా కూడా చేయాలి. బెల్టుషాపులతో పాటు మండలస్థాయి నుంచి మద్యం దుకాణాలు కొన్ని రోజుల పాటు కేవలం అసెంబ్లీ నియోజకవర్గ ప్రధాన కేంద్రానికి తరలించాలి. కొన్నాళ్లు ఆ విధంగా నడిపిన తర్వాత మద్యం దుకాణాలను జిల్లా ప్రధాన కేంద్రాల్లో మాత్రమే ప్రభుత్వం నిర్వహించాలి. ఈ విధంగా తక్కువ దుకాణాల తో పాటు ప్రతి మనిషికి ఒక పరిమితి పెట్టి అమ్మాలి. అప్పుడే ఈ మద్యం మహమ్మారి నుండి గ్రామీణ ప్రాంతాల ప్రజల ఆరోగ్యం ఆర్థిక స్థితిగతుల్ని ఈ ప్రభుత్వం కాపాడగలదు.
కానీ ఇవన్నీ ప్రభుత్వం అమలుచేస్తుందా లేకుంటే చేయగలదా అంటే ప్రస్తుతానికి కాదనే చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వానికి దాదాపుగా నెలకి మద్యం నుండి పదిహేను వందల కోట్ల ఆదాయం లభిస్తుంది అంటే ఇది సంవత్సరానికి 18 వేల నుంచి 20 వేల కోట్ల వరకు ఆదాయం ఉంటుంది. ఇంత పెద్ద ఆదాయ వనరు అప్పుల్లో ఉన్న రాష్ట్రం వదులుకుంటుందా అనేదే ప్రశ్న. ఈ ఆదాయం మార్గాన్ని మూసేస్తే దీనికి సమానంగా ఆదాయం వచ్చే మరో వనరు ప్రభుత్వానికి లేదు.
మాట తప్పను మడమ తిప్పను అని ఎప్పుడూ చెప్పే వైస్ జగన్ మోహన్ రెడ్డి, మొండిగా ముందుకెళ్లి సంపూర్ణంగా మధ్యాన్ని నిషేదిస్తారో లేకుంటే అందరిలాగే సాకులు వెతుకుతారో చూడాలి.