Guntur Student Vangoolu Deepti: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో జరిగిన రోడ్డుప్రమాదం గుంటూరు జిల్లా వాసులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. గుంటూరు జిల్లా రాజేంద్రనగర్‌కు చెందిన వంగవోలు దీప్తి అక్కడ జరిగిన ఘోర ప్రమాదంలో మృతిచెందింది. టెక్సాస్‌లోని డెంటన్ నగరంలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్‌లో ఎంఎస్ చదువుతూ ఉన్న దీప్తి ఈ నెల 12న తన స్నేహితురాలు స్నిగ్ధతో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా, వేగంగా వచ్చిన ఓ కారు వారిని బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో దీప్తికి తలపై తీవ్ర గాయమవగా, స్నిగ్ధ స్వల్ప గాయాలతో బయటపడింది. వెంటనే వారిద్దరినీ దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఘటన విషయం తెలుసుకున్న దీప్తి తండ్రి హనుమంతరావు, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ క్యాంప్ కార్యాలయాన్ని సంప్రదించారు. వెంటనే మంత్రి అమెరికాలోని తన బృందాన్ని అప్రమత్తం చేసి మెరుగైన వైద్యం అందించే ప్రయత్నం చేశారు.
గుంటూరులో ఉన్న మంత్రి సోదరుడు రవిశంకర్ సూచనతో, నవీన్ అనే వ్యక్తి క్రౌడ్ ఫండింగ్ ప్రారంభించగా, దాదాపు 80 వేల డాలర్లు సమకూరాయి. ఈ డబ్బులతో అత్యుత్తమ వైద్యం అందించినా, ఆమె ప్రాణాలు నిలబెట్టలేకపోయారు. ఈ నెల 15న ఆమె చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. శనివారం రోజున మృతదేహాన్ని గుంటూరుకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
దీప్తి తండ్రి చిరు వ్యాపారిగా పనిచేస్తున్నారు. ఆమె చిన్నప్పటి నుంచే చదువులో ముందుండేది. పదో తరగతి, ఇంటర్, ఇంజినీరింగ్ వరకు ప్రతిష్టాత్మక స్థాయిలో టాపర్‌గా నిలిచిన దీప్తిని అమెరికా పంపేందుకు కుటుంబం కొంత పొలం అమ్మింది. డిగ్రీ పూర్తి చేసి తమను అమెరికాకు రమ్మని ఆహ్వానం పంపిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.

