ఇంగ్లండ్ పర్యటనకు ముందు టీమిండియాలో కోచింగ్ సిబ్బందిపై బీసీసీఐ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇటీవల స్వదేశంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లతో జరిగిన టెస్ట్ సిరీస్‌ల్లో టీమిండియా తీవ్ర పరాజయాలను ఎదుర్కొన్న నేపథ్యంలో బోర్డు ఈ నిర్ణయాలను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌ను తొలగించింది.
గత ఏడాది జూలైలో గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన సమయంలో నాయర్‌ను అసిస్టెంట్‌గా నియమించారు. అయితే ఇటీవల టీమిండియా ఆటతీరు నిరాశపరిచిన నేపథ్యంలో, అతని పనితీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి స్టార్ ఆటగాళ్లు ఫామ్‌లో లేకపోయినా, కోచింగ్ సిబ్బంది స్పందించలేదంటూ మాజీ క్రికెటర్లు ప్రశ్నించడంతో నాయర్‌పై వేటు పడటం అనివార్యమైంది.
అలాగే, ఫీల్డింగ్ కోచ్ తిలక్ దిలీప్, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్‌ల కాంట్రాక్టులను కూడా బీసీసీఐ పునరుద్ధరించకూడదని నిర్ణయించినట్టు సమాచారం. వీరి కాంట్రాక్టులు ఈ జూలైలో ముగియనుండగా, ముందు జాగ్రత్తగా బోర్డు కొత్త సిబ్బందిని సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో అసిస్టెంట్ కోచ్‌గా ఉన్న ర్యాన్ టెన్ డెస్కట్‌ను ఫీల్డింగ్ కోచ్‌గా నియమించనున్నారు.
స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికాకు చెందిన అడ్రియన్ లీ రౌక్స్‌ను మళ్లీ తీసుకోవాలని బీసీసీఐ భావిస్తోంది. అతడు గతంలోనూ భారత జట్టుతో పని చేసిన అనుభవం ఉన్నవాడు. ఇంగ్లండ్ పర్యటనకు ముందు ఈ మార్పులు జరిగితే, టీమిండియాకు ఒక కొత్త దిశగా మార్పు వచ్చే అవకాశం ఉంది. బోర్డు తీసుకున్న తాజా నిర్ణయాలతో పర్యటనకు ముందు జట్టు మెరుగుపడుతుందా అన్నదే ఇప్పుడు ఆసక్తికరమైన అంశంగా మారింది.


