నిజంగానే వైఎస్ కన్నా రెండడుగులు ముందుకేసిన జగన్

పాదయాత్రలో కానీ బహిరంగసభల్లో కానీ తన తండ్రి వైఎస్ కన్నా రెండడుగులు ముందుకేస్తానని ప్రతీసారి చెప్పేవారు జగన్మోహన్ రెడ్డి. రెండడుగులు ముందుకేయటం అంటే ఏమిటో అనుకున్నారు అందరూ. తీరా రాబోయే ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్ధుల జాబితాను చూసిన తర్వాత జగన్ నిజంగానే వైఎస్ కన్నా రెండడుగులు ముందుకేశారనే అనుకుంటున్నారు.

175 అసెంబ్లీ, 25 లోక్ సభ అభ్యర్ధులకు ప్రకటించిన జాబితాలో కొట్టొచ్చిన అంశాలు మూడు స్పష్టంగా కనబడుతున్నాయి. మొదటిది మహిళలకు పెద్ద పీట వేయటం. రెండోది బిసిలకు అధిక ప్రాధాన్యత ఇవ్వటం. మూడోది కొత్తవారికి, విధేయతకే ప్రధాన్యత ఇవ్వటం. చంద్రబాబునాయుడు కూడా మొదటిజాబితాలో 126 మంది ఎంఎల్ఏ అభ్యర్ధులను ప్రకటించారు. అయితే టిడిపి జాబితాతో పోల్చుకుంటే వైసిపి జాబితాపైనే జనాలను ఎక్కువ సానుకూలత వ్యక్తం చేస్తున్నారు.

వైసిపి ప్రకటించిన అసెంబ్లీ జాబితాలో 175 అసెంబ్లీలకు గాను 41 మంది బిసిలకు టికెట్లిచ్చారు. అలాగే 25 ఎంపి అభ్యర్ధుల్లో 7 మంది బిసిలు పోటీ చేస్తున్నారు. గతంలో వైఎస్ కూడా బిసిలకు ఇంత పెద్ద పీట వేయలేదన్నది వాస్తవం. టిడిపి జాబితాలో కూడా ఇంతమంది బిసిలు లేరు. ప్రకటించబోయే ఎంపి అభ్యర్ధుల్లో కూడా 7గురు బిసిలకు చంద్రబాబు అవకాశం ఇవ్వలేరు. ఎందుకంటే, రాయలసీమలోని ఎనిమిది సీట్లలో జగన్ ముగ్గురు బిసిలకు అవకాశం ఇస్తే చంద్రబాబు కేవలం ఒక్కరికి మాత్రమే అవకాశం ఇచ్చారు.

నిజానికి అన్నీ సామాజికవర్గాల్లో బిసిల జనాభానే ఎక్కువ. కాబట్టే మొన్నటి వరకూ చంద్రబాబు, జగన్ రాజకీయమంతా బిసిల చుట్టూనే తిరిగింది. అయితే, టికెట్ల కేటాయింపుకు వచ్చేసరికి జగన్ తన చిత్తశుద్దిని చాటుకోగా చంద్రబాబు తేలిపోయారు. దాంతోనే బిసి సామాజికవర్గాల్లో జగన్ కు ఆధరణ పెరిగుతోంది. దీని ప్రభావం కచ్చితంగా రేపటి ఎన్నికల్లో కనబడుతుందని విశ్లేషణలు కూడా మొదలయ్యాయి. మరి జనాలు ఏం చేస్తారో చూడాల్సిందే.