చివరినిముషంలో వైసిపి జాబితా ప్రకటనను జగన్మోహన్ రెడ్డి వాయిదావేశారు. అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు పూర్తయిపోయిందని, ప్రకటనే మిగిలుందని ఉదయం నుండి జగన్ మీడియా కూడా ఒకటే ఊదరగొట్టింది. అలాంటిది చివరినిముషంలో జాబితా ప్రకటనను వాయిదా వేశారు. 16వ తేదీ ఇపుపులపాయలో ప్రకటిస్తారని సమాచారం.
అభ్యర్ధుల ఎంపికపై జగన్ చాలాకాలాంగా కసరత్తు చేస్తునే ఉన్నారు. పాదయాత్రలో భాగంగా ఇప్పటికే సుమారు 20 మందిని ప్రకటించిన విషయం తెలిసిందే. 18వ తేదీ నుండి నామినేషన్ల స్వీకరణ మొదలవుతోంది. అంటే అభ్యర్ధుల ఎంపికలో పెద్దగా సమయం కూడా లేదు. అందుకనే ఈరోజు ఉదయం ప్రకటించేస్తారంటూ ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్లే జగన్ కూడా ఉదయం నుండి పార్టీ ముఖ్యనేతలతో బిజీ బిజీగా గడుపుతున్నారు.
లోటస్ పాండ్ లో హడావుడి చూసిన తర్వాత మొదటిజాబితా ప్రకటన ఖాయమనే అనుకున్నారు. తీరా చూస్తే జాబితాను వాయిదా వేస్తున్నట్లు వైసిపి వర్గాలు చెప్పాయి. పార్టీలో చేరికలు జోరందుకున్నాయి. ఇపుడు ప్రకటించాలని అనుకున్న మొదటిజాబిత నియోజకవర్గాల్లోని ముఖ్య నేతలు కొందరు టిడిపిలో నుండి వైసిపిలోకి చేరబోతున్నట్లు సమాచారం అందిందట. అందుకనే వచ్చే వారెవరో చూసుకుని తర్వాత జాబితా ప్రకటిస్తే బాగుంటుందని అనుకున్నారట. అందుకనే చివరి నిముషంలో జాబితా ప్రకటనను వాయిదా వేశారు.