మీడియాలో కనబడనిదే తెలుగుదేశంపార్టీ జనాలకు ఊపిరి కూడా ఆడదు. చంద్రబాబునాయుడు దగ్గర నుండి దిగువస్ధాయి నేత వరకూ ఇదే ఒరవడి. ఈ విషయం తెలుగు జనాలకు బాగా తెలుసు. అలాంటిది బుధవారం ఎన్నికల సంఘం కార్యాలయం ముందు ధర్నా చేసిన చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. అంతే తర్వాత ఇప్పటి వరకూ అడ్రస్ లేరు.
అంటే దాదాపు 36 గంటలపాటు చంద్రబాబు అసులు మీడియాలోనే కనబడలేదు. ఇక్కడే టిడిపి జనాలకు అనుమానం వస్తోంది. రాబోయే ఫలితాలు టిడిపికి వ్యతిరేకంగా ఉండబోతున్నాయన్న సంకేతాలే ఎక్కువగా కనబడుతున్నాయి. పోలింగ్ జరిగిన తీరు, పోలింగ్ సందర్భంగా టిడిపి నేతలు జరిపిన దాడులను లెక్కలోకి తీసుకుంటే అదే అనుమానం వస్తోంది అందరికీ.
పోలింగ్ జరుగుతున్నంత సేపు చంద్రబాబు వైపు నుండి లీకులు రావటమే కానీ మీడియా ముందుకు మాత్రం రాలేదు. ఒక్క చంద్రబాబే కాదు ఏ నేత కూడా మీడియా మొహం చూడలేదు. తామే గెలుస్తామని, తమకన్ని సీట్లు వస్తాయని ఇన్ని వస్తాయనే కాకి లెక్కలను కూడా వినిపించలేదు. అంటే దీన్నిబట్టి రాబోయే ఫలితాలు టిడిపికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయన్న విషయం అర్ధమైపోతోంది. ఏదో మొక్కుబడిగా నేతలతో టెలికాన్ఫరెన్సులో చంద్రబాబు మాట్లాడుతూ తమకు 130 సీట్లు వస్తాయని చెప్పారు.
అదే జగన్ విషయం తీసుకుంటే పోలింగ్ ముగిసిన వెంటనే మీడియా ముందుకొచ్చారు. ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. సరే అధికారంలోకి వచ్చేది తామే అని చెప్పారనుకోండి అది వేరే సంగతి. ఇక్కడ విషయం ఏమిటంటే, గురువారం రాత్రి 9.30 గంటలకు చంద్రబాబు మీడియా సమావేశం ఉంటుందని సమాచారం ఇచ్చిన టిడిపి నేతలు మళ్ళీ రద్దయినట్లు చెప్పారు. ఏమిటంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉందని చెప్పటం విచిత్రంగా లేదూ.