బీజేపీ రాయబారానికి టీడీపీ “నో”

ఆంధ్రాకు ప్రత్యేక హోదా కల్పించాలని, విభజన హామీలు నెరవేర్చాలని కోరుతూ వర్షాకాల సమావేశాలలో టీడీపీ ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై గురువారం లోక్ సభలో టీడీపీ ఎంపీలతో మంతనాలు జరిపారు సెంట్రల్ మినిష్టర్ అనంత్ కుమార్. సీట్లలో కూర్చుని కూడా నిరసన తెలపవచ్చని ఆయన నేతలకు సూచించారు. ఇలా సభకు అడ్డు పడుతూ ఎన్నిరోజులు నిరసనలు తెలుపుతారని టీడీపీ ఎంపీలను ప్రశ్నించారు అనంత్ కుమార్.

కానీ ఆయన మంతనాలు ఫలించలేదు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే వరకు సభలో తమ నిరసన కొనసాగుతూనే ఉంటుందని ఖరాఖండిగా తెలిపారు టీడీపీ ఎంపీలు. ప్రస్తుతం ఢిల్లీలో టీడీపీ ఎంపీల నిరసన కొనసాగుతూనే ఉంది. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు జరపాలని నినాదాలు చేస్తూ పార్లమెంటు బయట ఆందోళన చేస్తున్నారు.

గల్లా జయదేవ్ మీడియాతో మాట్లాడుతూ మేము బీజేపీ ప్రభుత్వంపైన నమ్మకం కోల్పోయాము, వారు స్పందించి మా డిమాండ్స్ నెరవేర్చే వరకు మా నిరసన కొనసాగుతూనే ఉంది. మేము ఇలా నిరసన తెలపటానికి ప్రధాన కారణం మోడీ ప్రభుత్వం వలన ఆంధ్రాకి జరిగిన అన్యాయం గురించి దేశంలోని ప్రతి ఒక్కరికి తెలిజేయటం. రానున్న ఎన్నికలలో దీని ప్రభావం బీజేపీ పార్టీ ఓటమికి కీలకం కావాలని, అప్పుడే ఆంధ్రా హక్కులు సాధించుకుంటుందని వ్యక్తం చేశారు.

చిత్తూర్ ఎంపీ శివప్రసాద్ మాట్లాడుతూ ప్రధానమంత్రిగా అవకాశమొచ్చిన మోడీ, ఆ పదవిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పోలవరంపై ఆంక్షలు అవమానాలు మాని నిధులు పంపిణీ చేసి సకాలంలో పనులు పూర్తయ్యేలా చూడమని కోరారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మిమ్మల్ని జీవితాంతం గుర్తు పెట్టుకుంటుందని సూచించారు. మాట ఇచ్చి తప్పుకోవటం మీ లక్ష్యమా మోడీ అంటూ మోడీని ప్రశ్నించారు. వెటకారం మీ స్వభావమా..? అహంకారం మీ అలంకారమా..? నిరంకుశం మీ స్వరూపమా..? ఇదే పార్లమెంటుకి ఎంతోమంది ప్రధాన మంత్రులు వస్తారు…వెళ్ళిపోతారు. మీరు కూడా శాశ్వతం కాదు మీరు కూడా వెళ్ళిపోతారు. కానీ మనిషిగా వెళ్ళండి, మంచిగా వెళ్ళండి, మానవత్వంతో వెళ్ళండి అంటూ మోడీని హెచ్చరించారు ఎంపీ శివ ప్రసాద్.