Tirupathi: తిరుపతి పవిత్రత మంటగలుస్తోంది… డిప్యూటీ సీఎం పవన్ ఎక్కడున్నారు: భూమన

Tirupathi: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతి లడ్డు విషయంపై పెద్ద ఎత్తున సంచలనం రేపిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డు తయారీకి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని కాకుండా జంతువుల కొవ్వుతో తయారుచేసిన నూనె ఉపయోగించారు అంటూ కూటమి నేతలు చెప్పడంతో ఈ విషయం కాస్త తీవ్ర దుమారం రేపింది.

ఇక ఈ విషయంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏకంగా ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టడమే కాకుండా సనాతన ధర్మం గురించి పెద్ద ఎత్తున క్లాసులు కూడా తీసుకున్నారు అయితే ప్రస్తుతం ఈ విషయంపై మాజీ తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు. తిరుచానూరు సమీపంలో పబ్ ను తలపించేలా నిర్వహించిన ఈవెంట్ చర్చనీయాంశమైన వేళ.. భూమన మీడియాతో మాట్లాడారు. మద్యంతో పాటు మాదకద్రవ్యాల వినియోగించారనే వార్తలు కలిచివేస్తున్నాయని అన్నారాయన.

దేవదేవుడు కొలువైన తిరుపతిలో కూటమి ప్రభుత్వ అసమర్థ పాలన వల్లే ఇటువంటి దుష్ట సంస్కృతికి బీజం పడింది. అధికార పార్టీ అండతోనే పబ్ తరహా ఈవెంట్ జరిగింది. ఆధ్యాత్మిక చరిత్ర ఉన్నటువంటి తిరుపతి ఆలయం సమీపంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడానికి కూటమి ప్రభుత్వ తీరే కారణమని మండిపడ్డారు. సనాతన ధర్మంను కాపాడేందుకు అవతరించిన పీఠాధిపతి పవన్‌ కల్యాణ్‌ ఈ ఘటనపై స్పందించాలి. డిప్యూటి సీఎం హోదాలో తిరుపతిలో ధర్మానికి జరుగుతున్న విఘాతంపై ఆయన తన దండంను బయటకు తీసి ఇందుకు కారణమైన కార్యకర్తల పట్ల చర్యలు తీసుకోవాలి అంటూ డిమాండ్ చేశారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతిలో విచ్చలవిడిగా మద్యం ఏరులై పారుతుందని భూమన గుర్తు చేశారు. కొన్ని మద్యం దుకాణాలు ప్రభుత్వం నిర్దేశించిన సమయాలను పాటించడం లేదని ఉదయం ఏడు గంటలకే షాప్ తీయడమే కాకుండా రాత్రి 10 దాటిన మద్యం దుకాణాలు తెరిచే ఉంటున్నాయి అంటూ ఈయన మండిపడ్డారు.