సుప్రీమ్ కోర్టు గురువారం సంచలన తీర్పు ప్రకటించింది. వివాహేతర సంబంధాలను నేరంగా పరిగణించే ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 497ను ఏకగ్రీవంగా కొట్టివేస్తూ చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. దీనితోపాటు వివాహ బంధానికి విరుద్ధమైన నేరాలకు సంబంధించిన నేర శిక్షాస్మృతి సెక్షన్ 198 ను సైతం కొట్టివేయడం జరిగింది.
భారత సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ నారీమన్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రాలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 497 సెక్షన్ కింద నమోదు చేయబడ్డ మాజీ ఎంపీ నామా వంటి కొందరి ప్రముఖులు కూడా వివాహేతర సంబంధం కేసుల నుండి ఊరట చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గతంలో ఖమ్మం మాజీ టిడిపి ఎంపీ నామా నాగేశ్వరరావు పైన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో 497 కేసు నమోదైంది. రామకృష్ణన్ అనే వ్యక్తి నామా తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని ఆరోపిస్తూ ఆయనపై కేసు పెట్టారు. తన భార్యకు విడాకులు ఇవ్వాలంటూ ఆయన బలవంతం చేస్తున్నట్టు రామకృష్ణన్ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కింద ఉన్నాయి చదవండి.
సికె రామకృష్ణన్, సుజాత భార్యాభర్తలు. 1992 నుండి 2013 వరకు వీరు అమెరికాలో నివాసం ఉండేవారు. కొన్ని కారణాల వలన భార్యను హైద్రాబాదులో విడిచి అమెరికా వెళ్లారు రామకృష్ణన్. ప్రతి 6 నెలలకు హైదరాబాద్ వస్తుండేవారు. 2018 లో ఆయన హైద్రాబాదుకు వచ్చినప్పుడు తన భార్య తీవ్ర మానసిక వేదనతో బాధ పడటం గమనించిన రామకృష్ణన్ భార్యను విషయం ఏమిటని ఆరాదీశారు.
ఆమె చెప్పిన విషయం విని షాక్ కి గురయ్యారు రామకృష్ణ. అదేమిటంటే ఆమె 2013 నుండి ఖమ్మం టిడిపి మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, ఆయన సోదరుడితో అక్రమ సంబంధంలో ఉన్నట్టు తెలిపింది. అయితే వారిరువురు ఆమెను హింసకు గురి చేయడం ప్రారంభించారని, సంబంధం కొనసాగించకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నట్టు తన భర్తతో తెలిపింది.
అయితే రామకృష్ణ నామా బ్రదర్స్ ఉదంతంపై 2018 ఏప్రిల్ లో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తన భార్యకు నామా బ్రదర్స్ నుండి ప్రాణహాని ఉన్నట్టు ఫిర్యాదులో ప్రతిపాదించారు. తన భార్య 2016 లో కూడా వారిపై కేసు పెట్టిందని అయినా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు విచారణ ప్రారంభించారు.
వారికి కొన్ని బలమైన ఆధారాలు లభించడంతో నామా సోదరులపై 497, 504, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసుకున్నారు. ఇప్పుడు సుప్రీమ్ కోర్టు ఇచ్చిన తీర్పుతో నామా సోదరులకు 497 కేసులో ఊరట కలిగే అవకాశం ఉన్నప్పటికీ 504, 506 కేసులు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సుప్రీమ్ కోర్టు తీర్పుతో 497 కేసులను పరిశీలిస్తున్నారు అధికారులు. స్త్రీ, పురుష అంగీకారంతో వివాహేతరం సంబంధం కొనసాగించినవారిపై నమోదైన 497 కేసులో కొట్టివేసే అవకాశాలు ఉన్నాయి. 497 తో పాటు అదనంగా సెక్షన్లు నమోదైన కేసులు కొనసాగుతాయి అని న్యాయమూర్తులు వెల్లడించారు.
నామా నాగేశ్వరరావు 2009 లో టిడిపి తరపున లోక్ సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2004 లో ఖమ్మం నియోజకవర్గం నుండి పోటీ చేసిన ఆయన ప్రత్యర్థి రేణుక చౌదరి చేతిలో పరాజయం పాలయ్యారు. 2014 లో ఆయన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతిలో 11,974 ఓట్ల తేడాతో ఓడిపోయారు.