తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావుకు సుప్రీం కోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. కేసు నమోదైన వెంటనే అమెరికాకు వెళ్లిపోయిన ఆయనపై అప్పటి నుంచి తెలంగాణ పోలీసులు కస్టడీకి ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, సుప్రీం కోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ కోసం వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం, ఆయన మూడు రోజుల్లోగా ఇండియాకు తిరిగి రావాలని స్పష్టం చేసింది. “ఇంత కీలక పదవుల్లో పని చేసిన వ్యక్తులు ఇలా విచారణకు దూరంగా ఉంటే దేశ చట్టాలపై విశ్వాసం ఎలా పెడతాం?” అంటూ కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావుకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు, ఆయన విచారణ అధికారులతో సహకరించాలని, తెలంగాణ ప్రభుత్వం ఆయనపై ఎలాంటి థర్డ్ డిగ్రీ వాడకూడదని స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఆయనకు పాస్‌పోర్ట్ తిరిగి ఇచ్చేందుకు ఆదేశిస్తూ, భారత్‌కు వస్తానని లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలని తెలిపింది. ఇది అతనికి తాత్కాలిక ఊరట అయినా, ముందస్తు బెయిల్‌పై పూర్తి విచారణ తర్వాతే నిర్ణయం తీసుకుంటామని కోర్టు పేర్కొనడం గమనార్హం.
ఈ కేసు తెలంగాణ రాజకీయాల్లోనూ కలకలం రేపుతున్నది. బీఆర్‌ఎస్ పాలన సమయంలో జరిగిన ఈ వివాదాస్పద ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు సీరియస్ మలుపు తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఫోన్ సంభాషణలు, ఆడియో టేపులు, రాజకీయ ప్రత్యర్థుల జాతీయ నేతలపై నిఘా వేశారనే ఆరోపణలు ఈ కేసు చుట్టూ తిరుగుతున్నాయి. ప్రభాకర్ రావు భారతదేశానికి వచ్చి విచారణలో పాల్గొంటే, ఈ కేసులో అసలు నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. మరి ఆయన భారత్‌కు రాగానే ఏమేం జరుగుతుందో వేచి చూడాలి.