Thug Life Movie: కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం థగ్ లైఫ్. ఇటీవల ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయిన విషయం మనందరికీ తెలిసిందే. బోలెడన్ని కాంట్రవర్సీ లతో ఈ సినిమా ఎట్టకేలకు థియేటర్లలో విడుదల అయింది. అయితే ఆశించిన స్థాయిలో మాత్రం ఈ సినిమాకు రెస్పాన్స్ రాలేదని చెప్పాలి. సినిమా విడుదల అయిన మొదటి మూడు రోజుల్లో భారీగా కలెక్షన్లను రాబట్టినప్పటికీ ఆ తర్వాత పెద్దగా కలెక్షన్స్ రాబట్ట లేకపోయింది. దానికి తోడు ఈ సినిమాను కర్ణాటకలో విడుదల చేయకపోవడం కలెక్షన్ల పై తీవ్రంగా ప్రభావం చూపిందని చెప్పాలి.
ఇది ఇలా ఉంటే థగ్‌లైఫ్ సినిమా నిషేధంపై సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై పూర్తి వివరణ ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. కన్నడపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలతో థగ్ లైఫ్ మూవీను కర్ణాటకలో నిషేధిస్తున్నట్లు కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటించింది. ఆ తర్వాత హైకోర్టులోనూ పిటిషన్ దాఖలు చేసింది. కమల్ క్షమాపణలు చెబితే విడుదలకు అనుమతి ఇస్తామని చెప్పినా కూడా ఆయన వెనక్కి తగ్గలేదు. తాను ఎలాంటి తప్పు మాటలు మాట్లాడలేదని తన వ్యాఖ్యలను చాలా మంది తప్పుగా అపార్థం చేసుకున్నారని క్షమాపణలు చెప్పేది లేదు అని తేల్చి చెప్పడంతో థగ్ లైఫ్ ని కర్ణాటకలో రిలీజ్ చేయలేదు.
అయితే సెన్సార్ పూర్తయిన చిత్రాన్ని అనధికారికంగా నిషేధించారంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. తాజాగా థగ్ లైఫ్‌పై నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ జూన్ 17కి వాయిదా వేసింది. అయితే భారీ అంచనాల నడుమ విడుదలైన కమల్ హాసన్ సినిమాకు కలెక్షన్లు తగ్గడానికి ఇది కూడా ఒక కారణం అని తెలుస్తోంది. విడుదలకు ముందే ఈ వివాదం పెద్ద ఎత్తున వైరల్ అవ్వడం కూడా సినిమా కలెక్షన్లు రాకపోవడానికి కారణం అని చెబుతున్నారు నెటిజెన్స్. మరి సుప్రీంకోర్టు తీర్పు మేరకు కమల్ హాసన్ విచారణ ఇస్తారేమో చూడాలి మరి.