BRS Defection MLAs: మేము ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమే.. ఇదెక్కడి రాజకీయం..?

BRS Defection MLAs

MLAs Defection Case: 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వీరిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఉన్నారు. అయితే తమ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ నేతలు స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఫిర్యాదుచేశారు.

3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు

అయితే స్పీకర్ మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ న్యాయస్థానాలను ఆశ్రయించారు. 2024 ఏప్రిల్‌లో.. పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సింగిల్ బెంచ్ నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అనంతరం హైకోర్టు డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ ఆదేశాలను రద్దు చేసింది. దీంతో డివిజన్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై ఆరు నెలల పాటు విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం జులై 3వ తేదీన తీర్పును రిజర్వ్ చేసింది. ఇక జులై 31న ఫిరాయంపుదారులపై 3 నెలల్లోపు చర్యలు తీసుకోవాలని తుది తీర్పు వెల్లడించింది.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలగానే కొనసాగుతున్నాం

సుప్రీంకోర్టు నేపథ్యంలో స్పీకర్ పార్టీ మారిన ఎమ్మెల్యేలను వివరణ కోరుతూ నోటీసులు అందించారు. దీంతో కడియం శ్రీహరి, దానం నాగేందర్ సహా మిగిలిన 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్‌కు లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చారు. ఈ వివరణలో గతంలో న్యాయస్థానాలు ఇచ్చిన పలు తీర్పులను ఉదహరించారు. తాము పార్టీ మారలేదని.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నామని తెలిపారు. తాము ఎక్కడ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని తెలిపారు. అభివృద్ధి పనుల కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశామని పేర్కొన్నారు. కడియం, దానం మాత్రం తమ వివరణకు కొంత సమయకం కావాలని స్పీకర్‌ను కోరారు.

అభ్యంతరాలుంటే చెప్పండి

పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణలను ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు స్పీకర్ పంపించారు. దీనిపై మూడు రోజులు అభ్యంతరాలుంటే చెప్పాలని కోరారు. ఈ వివరణలను బీఆర్ఎస్ పార్టీ న్యాయసలహాలకు పంపింది. ఇదిలా ఉంటే ఎన్నికల్లో అధికారం కోల్పోగానే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇప్పుడు తాము ఇంకా బీఆర్ఎస్‌ పార్టీలోనే కొనసాగుతున్నామని చెప్పడం ఆశ్చర్యంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేవలం అనర్హత వేటు పడుతుందనే భయంతోనే ఇలా పార్టీ మారలేదంటూ వివరణ ఇచ్చారని చెబుతున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా.. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే.

రసవత్తరంగా ఫిరాయింపుదారుల వ్యవహారం

సుప్రీంకోర్టు మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వడంతో అనర్హత వేటు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే తాము ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే కొనసాతున్నామని చెప్పారని భావిస్తున్నారు. పార్టీ మారి కూడా ఇంకా పార్టీ ఎమ్మెల్యేమే అంటూ మాట్లాడటం చూస్తుంటే ఇదెక్కడి రాజకీయం అని జనం చర్చించుకుంటున్నారు. ప్రస్తుత రాజకీయాల్లో నేతలు ఇలాగే ఉంటారని పేర్కొంటున్నారు. ఫిరాయింపుదారులపై అనర్హత వేటు పడి ఉపఎన్నికలు రావడం ఖాయమని బీఆర్ఎస్ పెద్దలు డిసైడ్ అయితే.. మరోవైపు ఉపఎన్నికలు రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు చక్రం తిప్పుతున్నారు. మొత్తానికి పార్టీ ఫిరాయింపుదారుల వ్యహహారం మరింత రసవత్తరంగా మారింది.