YS Viveka: వైఎస్ వివేకా హత్య కేసు.. సుప్రీంకోర్టులో నిందితులకు ఊరట..!

supreme court

దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ సుప్రీంకోర్టులో జరుగుతోంది. ఈ కేసులో నిందితులకు బెయిల్ రద్దు చేయాలని వివేకా కుమార్తె వైఎస్ సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై కొంతకాలంగా న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోంది. తాజాగా ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం నిందితుల బెయిల్ రద్దు విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. బెయిల్ రద్దు, దర్యాప్తును కొనసాగించడానికి ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సూచించింది. ఇదే సమయంలో ఈ కేసులో సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలని సునీత తరపు న్యాయవాది వాదించారు. అయితే సీబీఐ ఇప్పటికే ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన విషయాన్ని కోర్టు గుర్తుచేసింది.

వివేకా హత్య కేసులో ఇప్పటివరకు 8 మందిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. వైఎస్ భాస్కర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, గజ్జల ఉదయ్ కుమార్ రెడ్జి, వి. రాజశేఖర్ రెడ్డిలను అరెస్టు చేసి జైలుకు పంపించారు. అయితే కపడ ఎంపీ అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు రాగా వీలుపడలేదు. అనంతరం తెలంగాణ హైకోర్టు ఆయనకు బెయిల్ ఇవ్వడంతో ఒక్కరోజు అరెస్ట్ చేసినట్లు అధికారులు చూపించి వెంటనే బెయిల్‌పై విడుదల చేశారు. దీంతో అవినాశ్ రెడ్డి మాత్రమే జైలు శిక్ష అనుభవించకుండా బెయిల్‌పై విడుదలయ్యారు. మిగిలిన నిందితులందరూ కొద్దికాలం జైలు శిక్ష అనుభవించారు.

అప్పటి నుంచి నిందితుల బెయిల్ రద్దు చేయాలంటూ వివేకా కుమార్తె సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తున్నారు. ఇటీవల విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసుకు సంబంధించిన అధికార దుర్వినియోగం జరిగిందని వ్యాఖ్యానించింది. అలాగే తప్పుడు కేసులు పెట్టారని పేర్కొంటూ సునీతతో పాటు భర్త రాజశేఖర్ రెడ్డి, సీబీఐ ఎస్పీ రాంసింగ్‌పై పెట్టిన కేసులను కొట్టివేసింది. ఈ క్రమంలో నిందితులకు బెయిల్ రద్దు కావడం ఖాయమని జోరుగా ప్రచారం జరిగింది. కానీ తాజా విచారణలో బెయిల్ రద్దు చేయలేమని.. ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని ఆదేశించడంతో నిందితులకు ఊరట లభించింది.

కాగా 2019 ఎన్నికలకు ముందు వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యారు. పులివెందులలోని ఆయన నివాసంలో హత్య కాబడిన సంగతి తెలిసిందే. ప్రత్యర్థులు హత్య చేశారంటూ వైసీపీ అధినేత జగన్ సహా వైసీపీ కీలక నేతలు ఆరోపించారు. అయితే వివేకా కుమార్తె సీబీఐ దర్యాప్తు చేయాలని హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం దర్యాప్తునకు అంగీకరించింది. అప్పటి నుంచి ఈ కేసు విచారణ న్యాయస్థానాల్లో జరుగుతూనే ఉంది.