సెల్ఫ్ పబ్లిసిటీ చేసుకోవటంలో, సెల్ఫ్ మార్కెటింగ్ లో చంద్రబాబునాయుడును మించిన రాజకీయ నేత మరొకరు లేరన్న విషయం అందరికీ తెలిసిందే. గడచిన నాలుగున్నరేళ్ళ పాలన మొత్తం కేవలం పబ్లిసిటీ మీదే నడుస్తోందంటే అతిశయోక్తి కూడా కాదు. చంద్రబాబు పాలనలో విషయం తక్కువ ఊపుడెక్కువ అన్నట్లుగా తయారైంది. ప్రతీ చిన్న విషయానికి మాగ్జిమమ్ పబ్లిసిటీ రాబట్టుకుంటున్నారు చంద్రబాబు. కాకపోతే ఒక్కోసారి పబ్లిసిటీ పిచ్చి మరీ పీక్ కు చేరుకుంటేనే అందరికీ చికాకు కలిగిస్తుంది.
తాజాగా జరిగిన ఓ ఘటనే అందుకు మరో ఉదాహరణగా నిలుస్తోంది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం. విజయనగరం జిల్లాలు తిత్లీ తుపాను దెబ్బకు బాగా నష్టపోయిన విషయం అందరికీ తెలిసిందే. ప్రభుత్వం కూడా సహాయ చర్యలు తీసుకుంటోంది. చంద్రబాబు కూడా రెగ్యులర్ గా అక్కడ పర్యటిస్తు సహాయ చర్యల్లో స్పీడ్ పెంచుతున్నారు. అంత వరకూ అభినందించాల్సిందే. కానీ అదంతా కాయన్ కు ఒకవైపు మాత్రమే. కాయన్ కు మరోవైపు కూడా ఉంటుంది కదా ?
అదేమిటంటే, ప్రభుత్వ సాయం అందకపోవటంతో చాలా గ్రామాల ప్రజలు నానా అవస్తలు పడుతున్నారు. తినటానికి తిండి లేదు. తాగటానికి మంచినీళ్ళు కూడా దొరకటం లేదు. కరెంటు కూడా లేదు. చిన్నపిల్లలకు పాలు కూడా దొరకటం లేదు. చాలా ప్రాంతాల్లో వేలాది ఇళ్ళు, వందల కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి. ఇవన్నీ వాస్తవాలే.
కానీ చంద్రబాబు ఏం చేస్తున్నారంటే తిత్లీ తుపాను బాధితులకందరికీ సహాయం అందిందని చెప్పుకుంటున్నారు. దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయ చర్యలు పూర్తయిపోయినట్లు చెప్పుకుంటున్నారు. పునర్నిర్మాణ పనులన్నింటినీ తమ ప్రభుత్వం చాలా వేగంగా రెస్టోర్ చేసేసిందంటూ అమరావతిలో పెద్ద పెద్డ హోర్డింగులు పెట్టుకోవటమే ఆశ్చర్యంగా ఉంది. అందుకు ప్రజలంతా చంద్రబాబుకు హారతులు పడుతున్నారనే విధంగా అమరావతిలో వెలసిన హోర్డింగులను చూసిన వాళ్ళు విస్తుపోయారు. ఎక్కడో తుపాను వస్తే ఇంకెక్కడో హోర్డింగులు పెట్టటం ఏమిటో అర్దం కావటం లేదు. పైడా హోర్డింగులను స్వయంగా ప్రభుత్వమే ఏర్పాటు చేయటం మరింత విచిత్రంగా ఉంది.