ఆర్భాటాలకు, ఆడంబరాలకు చంద్రబాబునాయుడు పెట్టింది పేరు. గడచిన ఐదేళ్ళల్లో వేల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని ఎంతలా దుర్వినియోగం చేశారో అందరికీ తెలిసిందే. సరే ఆ ముచ్చటేదో అయిపోయిందనుకోండి అది వేరే సంగతి. మరి అదే చంద్రబాబు ఇపుడేం చేస్తున్నట్లు ?
ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఏ చిన్న సమావేశం పెట్టాలన్నా చాలా భారీ ఎత్తున నిర్వహించేవారు. చివరకు పార్టీ కార్యక్రమాలను కూడా చంద్రబాబు ఏసి కాన్ఫరెన్స్ హాళ్ళల్లోనే నిర్వహించేవారు. ఆ మొత్తం ఖర్చంతా ఏదో ఓ రూపంలో ప్రభుత్వమే పే చేసేది.
మంగళగిరిలో హాయ్ ల్యాండ్ అనో లేకపోతే ఏ1 కన్వెన్షన్ హాలనో అది కాకపోతే స్టార్ హోటళ్ళల్లోను జరిపేసేవారు. అదే ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఎంత పెద్ద సమావేశమైనా చిన్న గదిలో కానిచ్చేస్తున్నారు. అంటే ప్రజల సొమ్మయితే ఒకలాగ ఖర్చు చేసిన చంద్రబాబు సిఎంగా దిగిపోయిన తర్వాత మాత్రం డబ్బులు లెక్క చూసుకుంటున్నారట. అందుకనే పార్టీ కార్యాలయాల్లో నిర్వహించేస్తున్నారు. అందుకు పై ఫొటోనే సాక్ష్యం.